పుట:Bhaarata arthashaastramu (1958).pdf/207

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఈ విపరీతములైన యూహలు నీటిబుగ్గలువంటివి. మిగుల తళుకుగానున్నవికాని గట్టివిగావు. ఎట్లన;

1. శ్రమలేని యింద్రభోగము కొనసాగు కోరికగాదు. యంత్ర నిర్మాణమునందును పనిజేయించుట యందునునైన మనము ప్రయాసపడియే తీరవలయు. ఈమాత్రపు గష్టమును నష్టమౌట యేనాటికిని తటస్థింపదు.

2. యంత్రములవల్ల ప్రాణాధారములైన పరిగ్రహణ క్రియలు అనగా కృష్యాదులు అంతగా వైపుల్యమునకు రావు. అన్నిటికన్న యానమునందు యంత్రము లతిసమర్థములైయున్నవి. ఓడలు, పొగబండ్లు ఇత్యాదు నిట దృష్టాంతము. దీనిచే వినిమయము వికసిల్లినదే గాని తత్సమంబుగ పంటలు, లోహములు, నాతతములుగాలేదు. యానమునకు దరువాత రూపభేదకళలలో యంత్రములు విరివిగ ప్రయోజకములు. అయిననేమి? వినిమయ పరివర్తనము లెంతస్ఫారములైనను భూమ్యాదులనుండి యాకర్షింపబడు వస్తువుల ననుక్రమింప వలసినవేగాని యతిక్రమింపజాలవు.

3. పరికర్ష ణార్థమై యంత్రముల గొంతవఱకేగాని ఎక్కువగా నుపయోగించుట లాభకరముగాదు. ఏలయన, కృషి విషయమైన నిదర్శనముం జూడుడు! విత్తులు చల్లుటకును బావులనుండునీరు లాగి పాఱునట్లు చేయుటకును యంత్రములనుకూలములు. అయినను వానలు గావలసినవేగద! యంత్రములచే వాన నాకర్షింపజూచుట పిచ్చి తలంపు. మఱియు కాఱు ననుసరించి ఫలితముండును. ఇచ్చవచ్చినప్పుడు కోరిన గింజలుచల్లిన మొలచునా? కావున నదనులవేసి పని చేయవలయునేకాని ఫ్యాక్టొరీలలోవలె సమయాసమయములు విచారింపక ప్రవేశించుటతగదు. ఇందుచేత యంత్రములను సదాపోనిచ్చుట యసంగతము. సర్వదా త్రిప్పుచునునుండక అప్పుడప్పుడు వత్సరమున గొన్నిమాసములుమాత్రము ఉపయోగించినచో గిట్టిరాదు. మఱి