పుట:Bhaarata arthashaastramu (1958).pdf/204

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

1. మనవారు ఆంగ్లేయులు త్రోవజూపినంగాని ఇదివఱలో నైజసామర్థ్యంబున ప్రత్యగ్రపద్ధతుల నవలంబించునంత సాహసికులుగా నుండలేదు. ఇప్పు డిప్పుడు ప్రౌడులై స్వచ్ఛంద ప్రవర్తనకుం గడంగు చున్నారు. అయినను మొత్తముమీద అవునో కాదో యని సందిగ్ధములైన వ్యవహారములజోలికి నంతగాబోరు. ఇందునకు గారణములు. ధైర్యము చాలమి. అవివేకము, "నవీనమన్న నాకువలదురా అబ్బా!" యను పెద్దలనాటనుండివచ్చిన ప్రవృత్తి, నష్టమునకోర్చునంతటి ధనికులుగాకుంట, సంఘీభావశక్తి మొలచియు మొలవక యుండుటయు ఇత్యాదులు.

2. అయినను మనవారు ఉపేక్ష గలిగియుండలేదు. దీర్ఘ నిద్ర నుండి యిప్పుడే లేచిరి. కన్నులు తటాలున దెఱచుట కష్టము, కాకపోయినను ఊపిరిబిగబట్టియైన తెఱవనుద్యుక్తులై యున్నారు.

3. యంత్రకళలు అధికవృద్ధి న్యాయానుసృతములు. రాశి యెక్కువయౌకొలది వ్యయప్రయాసలు యధాక్రమముగ హీనములై వెలలకు నపజయము బుట్టింపజూచును. హస్తకళలు కొంచెముగా మాత్ర ముత్పత్తిజేయుట కనుకూలించునవిగాన నిట వెలలు జాల తక్కువజేయుట సాధ్యముగాదు. కావున యంత్రకళలు దండెత్తి వచ్చెనేని హస్తకళ లస్తమింపవలసినదే.

ఈ కడపటి యంశము విమర్శచేయుటకునై, సంగతులు తెలియనిచో విమర్శచేసియు నర్థము కాదుగాన, నుపోద్ఘాతముగా యంత్రవృద్ధింగూర్చి యింత వ్రాయవలసివచ్చె. ఇక ముఖ్యాంశ ప్రశంస కారంభింతము.

యంత్రకళలవలన ప్రజకు మేలా కీడా?

యంత్రములు సర్వానర్థములకుంబాపి, దారిద్ర్యముదొలగించి, భూలోకమును స్వర్గసమముంజేయునని కొందఱు పేరాసతో నెదురు చూచుచున్నారు. ఈ చిత్తభ్రమకు గల్పకము లేవనిన;