పుట:Bhaarata arthashaastramu (1958).pdf/194

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అమెరికాపేరైనవినిన పాపమునంబోని కుగ్రామస్థుడైన పోలిశెట్టి దివాలెత్తిన నెత్తవచ్చును. చూచితిరా! యానసౌకర్యబద్ధమై లోకంబు సంకలిత వ్యవహారమైయుండుట? వ్యాపారచక్రమునకును భూచక్రమునకును పరిమాణభేదము మృగ్యము.

ఇరుగుపొరుగులతోమాత్రము క్రయ విక్రయములు జరుగు పూర్వకాలమ్మున ఎక్కువగా నుత్పత్తిజేయ నవసరము లేకుండెను. సరకులు వాణిజ్యములు నన్యోన్యాశ్రయములు. సరకులులేకున్న వాణిజ్యమారబ్ధముగానేరదు. వాణిజ్యములేనిచో తననై నేద్యమునకన్న నెక్కువ యెవ్వడును సిద్ధపఱచడు. గ్రాహకులులేనిది దాయకు లుండరు. అమ్మువా రుండవలయునన్న గొనువా రుండవలయును. వాణిజ్యవ్యాప్తియు గమనసాధనయంత్రవ్యాప్తియు బరస్పర సంకీర్ణములు. యాత్రలకు వీలులేకున్న బేహారములకు జేటునిజము. ఇక బేహారమునం దపేక్షలేనిది తీర్థ సేవకులు కొందఱుదక్క ప్రయాణీకులు తఱుచుగానుండరుగాన గమనసౌలభ్యముంగూర్చి చింతించి యుత్కృష్ట స్థితికిందెచ్చు నుపాయముల బన్నువారుండరు.

కావున ఉత్పత్తి, వాణిజ్యము, యానసౌకర్యము, ఒండొంటితో గలయిక గలవియనుట ప్రకటము

మనదేశమున ఆంగ్లేయులచే నేర్పఱుపబడిన రైల్వే, టెలిగ్రాఫ్,టెలిఫొన్ ఈలాంటివి యున్నవిగాని జనులయొక్క యాచారాదులు వానిచే గలుగగల మేలిమిని సంపూర్ణముగ ననుభవింప నియ్యవు. ఇవి వర్తకమునకును తద్ద్వారా ఉత్పత్తికిని హానికరములు. దేశదేశముల నిరాటంకముగ దిరిగి వారివారియభిమతముల బరిశీలించి కనుగొని సరకుల దయారుసేసినవానికి అమ్మకము నిక్కువము. మనయట్లు కూపస్థ మండూకములమాడ్కినున్నచో అర్థవృద్ధిపోయి అనర్థవృద్ధి మెండగును.