పుట:Bhaarata arthashaastramu (1958).pdf/188

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యను లంతగా బ్రవేశింపరు. సూర్యప్రభావ ముద్ధతముగ నున్నచోట వారు మనతో బ్రతిఘటింపజాలరు. కావుననే యుండబోలు మనదేశమున ననేకులకు సూర్యవంశజులనిప్రసిద్ధి! ఇదియు మనకు గొంత మేలే. ఐరోపావారు ఇట్లు కొన్నినేలలు గైవసము చేసికొన్నందున దేశమునకు మొత్తముమీద మేలా కీడా యను విషయము విచార్యము. మొత్తమున మేలనుటయేసరి. ఎట్లన బీడుపడిన నేలలు సస్యాఢ్యము లైనవి. అందుచే గూలినాలిచేసి బ్రదుకువారికి జీవనంబు దొరకినది. వాణిజ్యవ్యాపారములు వ్యాప్తములాయె. విదేశమునుండి తేబడిన మూలధన మీదేశమున వినియోగింపబడియె.

ఇక నష్టములనబడునవేవియన; మనకీయెడ యజమానత్వము లేకపోవుట యొకటి. అవునుగాని ఆయని నోరుతెఱచికొని కూర్చునియున్న యజమానత్వము తనంతటవచ్చి నోటిలోబడునా? ఈనేలలు పరాక్రమముచే నాక్రాంతములుగావు. సాధారణముగ నందఱితో సమానములయిన దరఖాస్తులచే లబ్ధములుగాన నూరక కుయ్యిడనేల?

వచ్చిన లాభమంతయు నింగ్లాండునకు బంపబడెడు ననుట రెండు. నిజమేకాని కష్టించి గడించినవారు పిళ్ళారులరీతిని కదల మెదల లేకుండువారికి సర్వము నైవేద్యముగా సమర్పించి నోటిలో వ్రేలుబెట్టుకొని పోవుదురా?

మఱియు నిందొక్క విశేషంబు. ఇప్పుడిప్పుడు ఈ నేలల మన వారు వెలకుగొని కొంచెము కొంచెముగ స్వామ్యసిద్ధి బడయు చున్నారు. మంచివెలదొరకిన యూరోపియను లేల అమ్మివేయరు? నిక్కముగ నమ్ముదురు. కావున యూరోపియనులు మనకు ద్రోవ జూపువారేకాని ఆపువారుగారు.

ఇంకను నీదేశములో స్వదేశసంస్థానములుపోగా సాగుబడికి రాని భూముల విస్తీర్ణము (సుమారు సంఖ్యలు)