పుట:Bhaarata arthashaastramu (1958).pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బుట్టవంటిది. మతములు, ధర్మములు, దేవదత్తములనుట ఈ దేశములో దట్టముగ నిండియుండు మ్రోత ! అవన్నియు నుదరదత్తములే యనుట నివేదింపదగిన యాధునిక సిద్ధాంతములలో నొకటి. అట్లగుట నియ్యది యనర్థశాస్త్రంబుగా, గొందఱికిం దోచుగాబోలు.

నేను చారిత్రము, తత్త్వశాస్త్రము, ఈరెంటియందు గొంతకు గొంత శిక్షనంది యున్నాడను. చారిత్రమునకు సంబంధించినవి :- దేశచరిత్రములు, రాజ్యాంగ నిర్మాణము, రాజనీతి, అర్థశాస్త్రము ఇత్యాదులు. తత్త్వమునకుం జేరినయవి :- తర్కము (లాజిక్), నీతి, మనశ్శాస్త్రము, సంఘశాస్త్రము, సదసద్విచారము ఇత్యాదులు. వీనియందెక్కువ నాకు దెలియదు. కాని సామాన్యములైన ముఖ్యాంశముల నిసుమంతనేర్చితి. కావుననే ప్రకృతము మనుష్య సంబంధి శాస్త్రముల యన్యోన్యత సూచనగా దెలుప నుద్యమించి యుండుట. ఆ యుద్యమము కొనసాగెనో లేదో నిర్ణయించు భారము మీయది. ఆమూలాగ్రంబుగ వ్యాఖ్యానంబొనరింప జాలితినను నహంభావము గొన్నవాడగానని నా విన్నపము. సంఘ మనశ్శాస్త్రాది తత్త్వంబుల వాసన యేమాత్రమును లేనివాడు చరిత్ర శాస్త్రములను సయితము చక్కగా గ్రహింపజాలదనుట నిక్కువము.

ఏదైన నొకభాగము నెఱుంగంగోరిన నయ్యది వేనియందు జేరియున్నదో వానిని గూర్చియు విచారణ శుద్ధముగ జేయకుండుటకు గాదు. అయినను అన్నింటియందును సంపూర్ణజ్ఞానము వడయజూచుట పిచ్చితలంపు గావున శాస్త్రములు స్వభావమున భిన్నములు గాక యున్నను భిన్నములనిభావించి కొన్నిటిలో సాధారణమైన జ్ఞానమును, మనకు నభిరుచిగల యొక్కటి రెంటి నగాధమైన ప్రజ్ఞయు గడింప నెత్నించుట కర్తవ్యము. శాస్త్రములు ప్రత్యేకములు చేయబడుటకు మనుష్యుల యల్పకాల జీవిత్వమును, బలహీనతయును గారణములు.