పుట:Bhaarata arthashaastramu (1958).pdf/17

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తేరినగాని యాసముదాయమందలి యేశాస్త్రముయొక్కయు స్వరూపము గోచరింపదన్న, నంతటి తపశ్శక్తి యీ యల్పాయుష్కులగు కలికాలజనంబులకు సంపాదింప సాధ్యమా ? దీనికి సమాధానము:-

వైద్యులలో కంటివైద్యమునం బ్రగల్భులైనవా రున్నారు గారా ? వీరు దేహము నంతయు నెఱింగి తచ్చికిత్సయందుం గుశలులైయును నేత్రసంస్కారమునం దంత్యంత పరిశ్రమచేసి యందు నిరర్గళ సామర్థ్యులై పారంగతులోయనునట్లు కీర్తిం గడించినవారగుట నేత్రవైద్యులని బిరుదు వహించిరిగాని, నేత్రవైద్యు లన్నంతమాత్రమున నేత్రములందప్ప నింకెవ్వియు నెఱుంగని వారనుట కేవలము తప్పు. అట్లే మనుష్య మహాశాస్త్రములంగూర్చియు, కాలము, బుద్ధిబలము, అభ్యాసశక్తి, యివి మితములుగాన మనుష్యశాస్త్రసమితి యందెల్ల సమానమును, అసమానమునుఅగు పాండితిని సంపాదించుట యమానుష సాధ్యంబు. అయినను అన్నిటియందును ముఖ్యాంశములనైన గొంత వఱకు నెఱుంగమేని ఏభాగమునందును సిద్ధివడయుట దుస్తరము.

ఈ ముఖ్యాంశముల నైరోపాలోని విద్యార్థి బాహుళ్య మించు మించెఱింగియే యుండునుగాన వానిని ప్రతిగ్రంధమునందును జేర్ప నచ్చటివారి కనావశ్యకమును అసంభావ్యమును, మనలో నట్లు చేర్చ కునికి యుక్తముగాదని నాయభిప్రాయము. ఏలన, మనవారికి మనుజులయు, మనుజుల సంఘంబనబడు జాత్యాదులయు, లక్షణములు, గుణములు, చర్యలు, వీనింగూర్చిన శాస్త్రములు పరస్పర భిన్నములు గావనుట కలలోనైనప్రత్యక్షముగాని గుప్తవస్తువు. కావున నిచ్చట నీశాస్త్రముల యైక్యముంజూపు ప్రశంసలను లుప్తము చేయగాదు. మఱి చేయరాదును. ఎందులకన్న ఈ యజ్ఞాన మనేకానర్థములకు హేతువు. దేశభక్తి లేక మూఢభక్తియుండుట, వర్ణాది దురాచారములు, మొదలైన కాలసర్పములం బోలిన నపకార హేతువులకు