పుట:Bhaarata arthashaastramu (1958).pdf/164

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూలధనము మూడు తెఱంగుల నర్థము నుద్దీపింపజేయు

1. కర్మకరులకు భుక్తి నాపాదించుట. ఇయ్యది అద్దాని ఆదిమ కర్మంబు. ఇదియొక్కటి గుదిరిన తక్కినవి సులభముగ సాధ్యము లౌను. హిందూదేశములో ముక్కాలువాసి జనులు ఈమాత్రమును గూడబెట్టజాలనివారైనందున ఒక్కసంవత్సరము వానలేకున్నను మిలమిలలాడి కార్చిచ్చున మిడుతలంబలె గుంపులుగట్టి గతించు చున్నారు. ఇదియెంతయు శోచనీయ విషయము. ఏడాది భుక్తి ప్రాప్తించినట్లైన తెగువ చొరవ వినీతియుగలవారు ఇంకెన్నటికిని లోపముతాకుండునట్లు సామగ్రులను ఉపకరణములను నిర్మింపగలరని శాస్త్రజ్ఞుల యభిప్రాయము.

2. భుక్తికి దరువాత పనిముట్లు ముఖ్యము. పశ్చిమఖండములో కోట్లకొలది ద్రవ్యము యంత్రస్వరూపమై యున్నది.

3. యంత్రములు పనిలేక యుండనిచ్చిన కొన్నాళ్ళకు ద్రుప్పుపట్టి చెడును. కావున వానిచే దయారుకాబడు సరకులు దండిగ నుండవలయును. దూదియంత్రములు సదా తిరుగుచుండ వలయునన్న ప్రతిదినమును బండ్లకొలది ప్రత్తి ప్యాక్టరీలో దిగుచుండవలయును.

చలాచల మూలధనములు

మూలధనము చలము అచలము అని రెండు విధములు. యంత్రాదు లచలములు. చిరకాల మేకరూపముతోనే యుండునవి. తారుణ్యమునకురాని దూది నార వడ్లు మున్నగునవి చంచలములు. అనగా అచిరములును పరిపాకమునకు వచ్చునప్పటికి వస్త్రములు గోనెలు అన్నము మొదలగురీతుల రూపుమాఱునవియువని భావము. ప్రకృతినుండి పరిగ్రహింపబడు సరకులు సాధారణముగ జంచలములు.

అచల మూలధనములు

అచల మూలధనం బెంతయు గణనీయంబు. దీనియందు ముఖ్య లక్షణములు కొన్నిగలవు. అవేవన;