పుట:Bhaarata arthashaastramu (1958).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బోధలజేతురు. ఫలపరిత్యాగబుద్ధియు గోరికలలో జేరినదేకాన ఎట్లును వాంఛారహిత వర్తనంబు సమగూరుట యసాధ్యంబు. సిద్ధుల గోరక సమారబ్ధుడౌట యెట్లో చెప్పువా రెవరునులేరు. పంటయం దిచ్ఛలేకున్న విత్తులేల చల్లవలయు? ఫలములయెడ బ్రహ్మార్పణ బుద్ధితో లోకయాత్రకొరకు పాటుపడవలయునందురేమో. పాపసంచయమెల్ల "కొఱకు" లో నిమిడియుండ లోకయాత్ర "కొఱకు" మాత్ర మెట్లుయోగ్యమౌను? రక్తిలేమినా శక్తిలేమినా మనమాసలు గూడవనుట! యోచింపుడు!

"అపజయమైన చింతించుట న్యాయంబుగాదు; తనకుం గీడు గలుగనీ మేలుగలుగనీ ధర్మంబు వదలరాదు" అను తత్త్వము లుత్తమములు. "అపజయమైన విచారపడకుము" అను వాక్యమునకు మనవారు "జయకాంక్షయే యుంచుకొనరాదు. ఆ కాంక్షలేకున్న నపజయమైనను దు:ఖ ముండదుగా" అని యర్థముచేసిరి కాబోలు. ఎట్లు చూచినను ఆశ లడుగంటుటయుగాదు. అడుగంట వలయుననుటయు గాదు. మఱేమన వీనిలో నుత్తమాధముల నిర్ణ యించి శ్రేయస్కరము లైనవాని దృప్తిజేయబూనుట కర్తవ్యంబు.

ఇంతేకాదు. కూడబెట్టిన ధనంబులు అగ్ని, భూకంపము, సముద్ర ముప్పొంగుట మొదలగు ననాహుతములచే నశించుం గావున ఎన్నటికిని ఒకటేవిధముగ వృద్ధిజెంది యర్థములు కొలదికి మీఱుట యసంభవము.

ఒకవేళ కొలది నతిక్రమించునను అవధి యుండెబో, అది ఈ దారిద్రదేశములో నగుననియెన్ని భయము బొందనక్కఱలేదు. ఇక గొన్నియుగముల కమితధనరాసు లుండునేమో! ఐనను ప్రళయ కాలములో వానలు విపరీతముగ గురియునని ఇప్పుడే చెఱువుకట్టల దెగగొట్ట నెవడును బూనడు. అట్లుచేయుట నిరక్షరకుక్షులు జ్ఞానాధిక్య పైత్యమగునను భయంబువలన విద్యల విసర్జించినట్లు.