పుట:Bhaarata arthashaastramu (1958).pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

యుండుట తటస్థించె? కావున రాజ్యాంగములు చక్కగా నడువ వలసినవియేయైనను అవియే అనుచిత మార్గములంబూనిన అరాజకమున కన్న నెగ్గగు. అక్రమ ప్రభుత్వమునకన్న నిష్ప్రభుత్వమే నీటు. కావలివాడే దొంగయైన నేమిగతి

ప్రకృతము న్యాయవాదులు లెక్కకు మిక్కిలిగ పుట్టలోని చెదలట్లు బయలుదేరుచున్నారు. "వీరు బ్రిటిష్ గవర్నమెంటు అను పాలసముద్రములో హాలాహలప్రాయులై యున్నారు" అని యొకరు నుడివిరి. న్యాయవాదు లైనవారు వివాదములు నానాటికి గొఱత వడునట్లొనరింపవలయుగాని తామే వానికి చోదకులై మునుపటికన్న వాని నుప్పతిల్లంజేయుచు నన్యాయవాదులౌట గౌరవహీనమొనరించు పని. ఏది ఎట్లుండె? వీరి నిందించిన లాభమేమి? కారణభూతులయిన గవర్నమెంటువారే యీ నిందకుం బాత్రులు. అదెట్లన:- విద్యాభ్యాసము, రెవిన్యూ, పోలీసు, సైన్యము ఈ యిలాకాలలో మనవారు గుణానుగుణ ప్రాశస్త్యము బడయ వసతులు లేనందున, జాతి వర్ణాది నిమిత్తములచే నిరోధింపబడని న్యాయవాదిమార్గంబున బుంఖాను పుంఖములుగ జీవయాత్రకై ప్రవేశించుట యేమియాశ్చర్యము. "అందఱును వకీళ్ళయ్యెద" రని మనల గర్హించి పలుకు దొరలు ఆ వకీళ్ళకేతప్ప తదితరులకు మహోత్కృష్ట పదవుల నొసంగ జాలరు గాన వారి పరుషములు వారికే చెందవలయునని తోచెడి.

అమితంబైన నేవృత్తియు హాని ఘటించును. కృషి వ్యవహారములు సాధారణముగ నపారములౌట యసంభవము. రాజసేవ, న్యాయవాదిత ఇత్యాది రక్షక వృత్తులు పెల్లుపెఱిగెనేని నిమిషములో భక్షక వృత్తులౌను. అలంకారవృత్తులును ఇట్లే. స్వర్ణకారకులు కొద్దిగానున్న గీడులేడు. అసంఖ్యులైన దుస్సహులగుదురు. కావున మొత్తముమీద వకీలి మొదలగునవి తమకు ఆదాయావహములైనను దేశమునకు నపాయావహములు గావచ్చునుగాన జాగ్రత్త జెప్పవలసె.