పుట:Bhaarata arthashaastramu (1958).pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

పీఠిక

ఈ గ్రంథములోని విశేషములు మూడు.

మొదటిది:-

ఈ శాస్త్రమంతయు హిందూదేశమునకుం జేరిన విషయములతో నెక్కువ సంబంధము గలిగియుంట. ప్రకృతము మన విద్యాశాలలలో వాడబడు నర్థశాస్త్ర పుస్తకము లనేకములు విదేశవర్తమానములనే సూచించునవిగా నుండబట్టి మనవారికి ఐరోపా అమెరికా మొదలగు దేశములంగూర్చి తెలిసినంత తమ దేశముంగూర్చి తెలియకుండుట యెంతయు జింతనీయము మాత్రమేకాదు ఉత్పాతకరమును. ఎట్లన పాశ్చాత్త్యులసీమలలో మేలని ప్రసిద్ధికెక్కిన న్యాయములు రాజ్యతంత్రములు ఇత్యాదులు మనకును బనికివచ్చునని విచారణచేయక యభ్రమబొందుదురుగాన ---

            "................................తెలిసియు
             దెలియని నరుఁదెల్ప బ్రహ్మదేవుని వశమే"

అన్నట్లు ఈ స్వల్పజ్ఞానులకు గర్వ మెంతయని చెప్పవచ్చును ? పోనిండు ! ఒక గర్వముమాత్రముతో బోయిన మనకేమి కొదవ ? వీరు వలదన్నను రాజకార్యములలో మంత్రాలోచన నిచ్చువారై దేశమునకు గీడు దేరేని అదియే మహాభాగ్యంబు ! చూడుడు. నిమ్మపండువంటి దేహచ్ఛాయగల యొక స్త్రీ తన కనుగుణమైన రంగుగల యొక వలువ ధరించి యెంతయు రమణీయముగ గాన్పించిన నది కారణముగ నేరేడుపండును ధిక్కరించు మైఛాయగలవనితయు నట్టి చీరయే తనకును గావలయునని మూర్ఖతకుం జొచ్చి దాని ధరించిన నది యాకారమునకు మేలమా ? వికారమునకు మూలమా ? యోజింపుడు. నిజమైన సాదృశ్యము లేదేని సమప్రవర్తన తగవుగాదు. కావున :-