పుట:Bhaarata arthashaastramu (1958).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

చేతలలో లేదనుట తేటతెల్లంబు. ఎట్లన మితిమీఱి శుభాశుభములలో సెలవుజేయుట కేమికారణము? అక్క ప్రక్కల బంధువులేమైన నందురను భీతియేకదా? పిఱికితనమునకు లొంగువానికన్న నధము డెవ్వడు? వెఱపునే ఆపజాలనివాడు ఇంకెద్దాని నడ్డగింపగలడు? యోచింపుడు. తన మనోనిశ్చయమునకన్న ఎల్లమ్మ పుల్లమ్మ ఎక్కువయని యాదరించువాడు మగవాడో మ్రానో?

మూలధనము

విపులార్థసాధనంబునకు కాలంబొక కతంబు. ఫలము చేతికందు వఱకును కర్ముకరులకు భరణము జరుగవలయుగదా! నిరాహారులై వుండుటకు వీరివల్లగాదు. అట్టిగారడీవిద్య ఋషులపాలిసొత్తు. మఱియు నితరసాధన కలాపము పచ్చిసరుకులును గావలసియుండును. పరిశ్రమ కాలంబున వినియోగ్యములు లభించు పర్యంతము కర్మకరపోషణాది ప్రయోజనములకై యుపయోగింపబడు వస్తుసముదాయంబు మూలధనంబు. మూలమనగా వేరు. చెట్టునకు వేరు ఎట్లో అట్లే వ్యవహార విస్తృతికి మూలధనం బాధారంబు. మూలధనంబులేనిది గడన గొంత మట్టునకున్నను అది వ్యాపింపజాలదు. పశ్చిమఖండపువారి కళా వాణిజ్యము లింత విశ్వవ్యాప్తములై యుండుటకు వారికింగల అమిత పరిపణములే నిదానంబులు. ఈ విచార మింకను ముందు చర్చింతుము.

దీర్ఘదర్శిత్వము నాగరికుల లక్షణము

ముందు జాగ్రత్తయనునది నాగరికతంబట్టి యుండును. మృగప్రాయుల కుండదు అడవిమనుష్యులకన్న మనముమేలు. మనకన్న ఇంగ్లాండ్ జపాన్ దేశస్థులుమేలు. ప్రాజ్ఞులైనవారు తాత్కాలిక ఫలములనేఆశింపరు. చిత్తసంప్రధారణముగలిగి భావికి వలయువానిని సిద్ధము జేయుటయందే యుద్యోగింతురు. దృష్టములకన్న నదృష్టంబులు ముఖ్యంబులు.