పుట:Bhaarata arthashaastramu (1958).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

అనగా వర్తమానంబునంగాక భావిని వినియోగ్యార్ధముల నిచ్చునవి యనుట, కృషికుడు దున్నినది గోలె సుమారు నాలుగైదు నెలలు పక్షివలె వేచియున్నంగాని గింజలు లభింపవు. లభించిన ధాన్యం నెండబెట్టి దంచి, పొట్టు, తవుడు వేఱుచేసి బియ్యము వడయుటకు మఱియొకనెల పట్టును. అప్పటికి నది యనుభావ్యముగాదు. పిమ్మట భార్యచేతికిచ్చి వండించి విస్తరిలో వేయించు కొనవలయును. తదనంతరము భుజించి కృతార్థుడౌట. ఈ కడపటి కార్యము ప్రత్యక్ష ఫలదాయి తక్కినవన్నియు నిందున కనుగుణములైన పరోక్ష ఫలప్రదాయిక క్రియలు. కావున నారంభసిద్ధులకు నడుమ గొద్దియో గొప్పయో కాలము గలదు.

కాలప్రభావము

ఇక గాలప్రభావంబు నిర్ణయింతము. అర్థంబుల యుత్కృష్టతతోన నిరీక్ష్యమాణకాలంబును యధాక్రమంబుగ వృద్ధిజెందెడిని. వేటకాడు బాణసంధానముజేసిన కొంతకాలమునకే మాంసము గడించిన వాడగును. అయినను వేటకాని బ్రతుకొక బ్రతుకా? నేడు మృగముల మందలుగ గనుగొని చావగొట్టవచ్చును. మఱునాడు వెదకి వేసరిల్లియు నేమియు బడయకపోవచ్చును. చింతలేని జీవనము గావలయునన్న తానే మేకలను జింకలనుబెంచి గొల్లవాని వృత్తి నవలంబించుట యావశ్యకము. మేలైన జీవితముగావున పిల్లలు పెద్దవి యగువఱకును పెద్దవియీని మంద సమృద్ధిగ జేయువఱకును వేచియుండవలయుటయేగాక మితముగా మందచెడకుండునట్లు హింసింప వలయునేగాని అశ్వత్థామ పాండవసేనం జేరినట్లు ఒకేరాత్రే చించి చెండాడిన మఱునాడే అష్టదరిద్రుడౌను: ఇంకొక దృష్టాంతము ఒక నెలలో తయారు చేయబడగల మగ్గముతో మనసాలెవాండ్రు 20 రూపాయల సరకుల నేయగలరు. ఒక సంవత్సరమునకైనంగాని ఆవిరి విద్యుచ్ఛక్తి వీనితోనడచు దూదియంత్రమునుచేసి నిలుపుటకుగాదు.