పుట:Bhaarata arthashaastramu (1958).pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

రాకున్నది. ఈగ్రంథమున జెప్పియుండునదేమన, "సర్వఫలములకును మూలాధారములైనవానిలో పౌరుషంబొండు" అని. ఇంతకన్న నెక్కుడు ప్రభావంబు పురుషుల కారోపింప బడదయ్యె. మఱియు ఆపదలు, రుజలు, మరణము పుట్టుక తనవశముగాకుండును గాన సర్వము దైవముయొక్కయో కర్మయొక్కయో వశమనుటయు గలదు. అనగా అసాధ్యములు కొన్నిగలవు గాన సాధ్యములేవియు లేవనుట! ఇది పొసగునో పొసగదో యోచించిచూడుడు! ఇంతే కాదు. నేను సర్వకర్త కాదనుట నిజమేకాని యది హేతువుగ సర్వకర్తృత్వ మింకొకని కెట్లు సంఘటింపవచ్చును? నేను పరమదరిద్రు డైనందుననే కుబేరు డింకొక డున్నాడని సాధింపగలుగుటెట్లు? నావికార మింకొకని సౌందర్యమునకు గారణమా? అది యట్లుండె. ప్రకృతియు నాధారకారణములలో నొకటియని యంటిమి. కావున ప్రకృతి ధర్మములకు విరుద్ధములైన వర్తనములు అసంగతములో అనిష్టాకరములో యౌటబట్టి దానితో సంశ్లేషించినంగాని వ్యర్థంబవు పౌరుషంబు తనంతట పూజనీయముగాదని సాధించుట హేత్వాభాసం బగుట కేమిసందియము? మరణము స్వభావసిద్ధము. అనగా ప్రకృతి ధర్మములలో నొకటి. ప్రకృతికి సహకారియు ననుకారియునైన మానుషయత్నంబుచే నది నిర్జితంబు గాకపోవుటంబట్టి మనయత్నంబు లెందునకు నుపయోగింపవనుట యసంబద్ధప్రలాపమేగాని వేరుగాదు. విత్తు భూమిలో పడనిది చెట్టుమొలవదు. కాబట్టి చెట్టుమొలచుటకు విత్తుగాదు కారణము భూమియే అన్నట్టున్నది. ఇది సరియైన వాదమే యైనపక్షమున ఇదేరీతిని భూమికాదు. విత్తేకారణమనియు జెప్పవచ్చునుగదా! అన్యోన్యాశ్రయములనుగూర్చి విచారించునపుడు ఒకటి హెచ్చు మఱియొకటి లొచ్చు అనుట మిధ్య. రెండును సమముగ ప్రధానములనియు వాని సాంగత్యము కార్యసిద్ధి కాలవాలంబనియు నెఱుంగునది. ఏడును రెండును గుణించిన పదునాలుగు అగును.