పుట:Bhaarata arthashaastramu (1958).pdf/121

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొంతకాలమునకు ఎంతమంచినేలయు సారహీనత జెందును. అప్పుడు కష్టమును ఎరువును ఎక్కువగ జేయజేయ పూర్వమట్లుగాక యథాక్రమంబుగ మాత్రము ఫలించును. అనగా రెండింతలకు రెండింతలు మూడింతలకు మూడింతలుగా ఫలము నిచ్చును. దీనిని యథాక్రమ వృద్ధియనిగాని సమవృద్ధియనిగాని పేర్కొందురు.

ఇంకను సాగుబడి జరుగను జరుగను భూమిబలముతగ్గి మొదటి కన్న నెక్కువగా నెరువు మొదలగునవి యుపయోగించినంగాని మునుపటియంత ఫలమియ్య శక్తిగలది గాకపోవును. ఈ యవస్థ తటస్థించుడు రెండింతలు ఫలము గావలయునన్న మూడు నాలుగింతలు ఆకు పేడ వినియోగింపవలసి వచ్చును. దీనిపేరు "హీనవృద్ధి న్యాయము".

పైమూడున్యాయములును అనుభవవిదితములు. అనాగరికులగు మూఢులుసైతము వీని నెట్లో గ్రహించి యనుష్ఠానమునకు దెచ్చినవారుగ నున్నారు. ఇందునకు దృష్టాంతము. ఎట్టి కుగ్రామము నందైననుసరే ఒకతూరి చెఱకుపయిరు జేసినవెనుక మఱి రెండు మూడేడులకుగాని యాభూమిలో చెఱకు నెవ్వడును నాటడు. ఎందుకని యడిగిన ఆ మళ్ళలోని సత్తువ యంతయు బీల్చివేయ బడినదనియు రాగి మొదలగునవి నాటి కొన్నివత్సరము లైనపిదప గాని చెఱకు వేసిన నెదుగదనియు కృషికుడు ప్రత్యుత్తరమిచ్చును. అట్లుగాక మఱుకారులోనే చెఱకు నాటవలయునన్న బండ్లకొలది ఎరువు వేయవలయును. అంత సెలవుచేసిన లాభము గిట్టదు. హీనవృద్ధి న్యాయంబున కిదియే తార్కాణము.

ఈ న్యాయంబుల నింకను స్పష్టముగ వివరింతము

1. అధికవృద్ధి

10 రూపాయలు సెలవుచేసి పంటబెట్టిన 20 పుట్లుత్పత్తియౌననుకొందము.

భూమిలో సారము ప్రబలముగా నుండుపర్యంతము

20 రూపాయలతో బంటబెట్టిన 50 పుట్లును (రెండితంలుకన్న నెక్కువ)

40 రూపాయలతో (బంటబెట్టిన) 110 పుట్లునుగా వృద్ధియగుచు వచ్చుననుట దీనిభావము.