పుట:Bhaarata arthashaastramu (1958).pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మితప్రకృతులలో గణ్యములైనవి గనులు, వనములు , నదులు, క్షేత్రములును. (క్షేత్రములన యాత్రాస్థలంబులుగావు పంటల కనుగుణములైన పొలములు)

గనులు

లోహములు గనులలో నుద్భవించును. వీనిలో నుత్తమోత్తమములు ఇనుము, బొగ్గు. ఇవి అన్యోన్యసమీపస్థములైన ఆ దేశము భాగ్యమేభాగ్యము. ఇనుము కరగించి యంత్రములు, కత్తులు మడకలు మొదలైన సామానులను జేయుటకు బొగ్గు మిక్కిలి యుపయోగించునది. కట్టెలలో నుష్ణ మంతలేదు. ఇది గాక యవి త్వరలో భస్మములౌను గాన వానిని ఎగంద్రోయుట వ్రేయుట యను పనులలోనె కాలము బహుళముగ వ్రయమగును. కావున గొయ్యలంత శ్రేష్ఠములు గావు. ఇండియాలో సేలము జిల్లా మొదలగు స్థలములలో నినుపగనులున్నవిగాని దగ్గఱగా బొగ్గులేనందున నవి యింకను బ్రయోజనమునకు రాలేదు. కలకత్తాకు సమీపమున రెండును అనతిదూరస్థములుగ నుంటచే నచట 'అయ:కర్మశాల' యొకటి మిగుల గొప్పది స్థాపింపబడుచున్నది.

అడవులు

ఉష్ణదేశములలో నడవులు ప్రాణసమానముగ నెన్నబడవలయును. వీనివలన దేశము శాంతత్వమును వహించును. వానలు గురిసిన నానీరంతయు అతివేగమున నిష్ప్రయోజనముగ గొండప్రక్కలగోసి ప్రవహింపకుండునట్లుచేసి నదులను సర్వకాలమునందు నేకరీతిని మందగమనమున బ్రవహించునట్లును భూమి యార్ద్రత వహించునట్లును జేయును. చెట్లవేరులు క్రింద బడిన యాకలములును జలమునడ్డగించి పుడమిలో నూరునట్లుగ జేయుటయేకాక మంచి యెరువుగను ఏర్పడును. పూర్వకాలమందు మనభరతఖండంబున ఎండకును వానకును జొరరాక దట్టములై వన్యమృగ సంతతులచే భయంకరములైన కామ్యకద్వైత దండకాది వనములుండినవని