పుట:Bhaarata arthashaastramu (1958).pdf/109

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సాధనములు మృగ్యములు. వజ్ర వైడూర్యములకన్న జలాహారము లధిక పూర్ణోపయుక్తి యుక్తములనుటకు జనుల యభిప్రాయమే సాక్షి. వజ్రవైడూర్యములు లేకపోయినను హాయిగ బ్రతుకువారు కోట్ల కొలది నున్నారు. జలాహారములులేక జీవించువారు పురాణకధల దప్ప నింకెక్కడనులేరు. కావున పూర్ణోపయుక్తిని లెక్కప్రకారము జమగూర్చుట యసాధ్యమైనయెడల లౌకికాచారముల ప్రకారము సకారణముగ గొలతవేయవచ్చును.

"ప్రయోజనమును గొలుచుట సాధ్యమా? యను ప్రశ్న అనేకులకు దోపక మానదు. ఏలయన, ప్రయోజనము భావగర్భితంబు. ఆకృతిగల స్థూలపదార్థముగాదు. సంఖ్యకలదియుగాదు. కావున తూచుట, జమగూర్చుట ఇత్యాది క్రియలు దానియందు జెల్లవు. ఇట్లని ప్రశ్నించువారికొక సమాధానముం జెప్పవచ్చును. ప్రయోజనము భావరూపమే యైనను స్థూలపదార్థములైన ధరలచే దాని ప్రాబల్యము సూచింపబడియెడు. ఉపయుక్తి యెక్కువయని తోచిన వెలల నధికముగ నిచ్చుటయు, తక్కువగా దోచిన దక్కువమాత్ర మిచ్చుటయు సహజములు. శరీరమునందలి యుష్ణముయొక్క తీవ్రతప్రకారము డాక్టరు పెట్టిచూచు 'తాపమాన' యంత్రములోని పాదరసము ఎక్కుచునో, దిగుచునో యుండుమాడ్కి నుపయుక్తత ననుసరించి ధరలు నిలుచుననుట నిక్కమే యైనను ఈన్యాయమునకును ప్రతికూలములు లేకపోలేదు. అట్లగుట నీకార్యము సాధ్యమైనను సులభముగానిదాయెను.

ప్రయోజనమును ధరలచే గొలుచుట కష్టతరముగను సత్యదూరముగను జేయుహేతువులు

1. ధరయన వస్తువులకు నాణెముల రూపముననుండు విలువ. ఒకయెద్దును గొనుటకు 50 రూపాయలుపట్టిన దానిధర 50 రూపాయ లందుము. అనగా దానియందు గ్రాహకునకుగల యంత్యోప