పుట:Bhaarata arthashaastramu (1958).pdf/108

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నఖండముగ గలిగియున్నను నంత్యోపయుక్తి లేనివగుట మూల్యరహితము లాయెననియు మూల్యదారిద్ర్యము వస్తుగౌరవమునకు భంగకరము గాదనియు మున్ను తెలిపిన తత్త్వములకు నియ్యది యింకను నొకసాక్ష్యము. మూల్యరాహిత్యమునకు నిష్ప్రయోజనతకును మిక్కిలి భేదము. మూల్యాభావము సంభవించుమార్గములు రెండు. ఒకటి వస్తువు ఎందునకుం బనికిరానిదగుట. ఉదా. వీధిలోని మన్ను ఇత్యాదులు. రెండు. వస్తువు పరమప్రయోజనకారియయ్యును అఖండముగ లభ్యమగుటచే రాసులు మితిమీరి యంత్యప్రయోజనా వశిష్టముం జేయుట. ఉదా. గాలి.

ఈ రెంటికిని భిన్నలక్షణము:- మొదటి దానికి బూర్ణోపయుక్తిలేదు. రెండవది దాని కది యసమానముగ నున్నది

వీనికి సామాన్య లక్షణము:- మొదటిది నిష్ప్రయోజనము గావునను రెండవది యమితరాశిక మగుటను రెంటికి నంత్యప్రయోజనములేదు. కావున విలువయు గానము.

ఐనను విలువలేని సామ్యముంబట్టి గాలియు వీధిలోని మన్నును దుల్యములే యనుట తులువతనము.

పూర్ణోపయుక్తిని మధింపువేయు పద్ధతు లెవ్వి?

వస్తువు అపురూపమైనదనుకొని యట్లైన నెంతవెల పొడుగగునో యని రమారమిగ నిర్ణయించి, పిమ్మట గ్రమక్రమముగ రాశికిం బరిమాణము లిడుచుంబోయిన వెల లెట్లుపడుననుట యూహించి, తుదకు వర్తమానముననుండు ధరల వఱకును వచ్చితిమేని పూర్ణోపయుక్తి స్ఫుటంబగును. ఇది మిక్కిలి ప్రయాసముచేతనేకాని యలతి దీఱు సాహసంబుగాదు. గాలి మొదలైన వస్తువులేనాడు నరుదుగావు. కావున వానికి క్షామకాలపు ధరల విధించుట యూహపై బోవలసిన లెక్కకాని దృష్టాంతముగజూపి నిర్ణయింప జాలినవికావు. ఇట్టిచోట్ల ననుభవముమీద వస్తుగౌరవముల స్థాపింపజూచుటదప్ప అన్య