పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

2

భారతనీతికథలు - రెండవభాగము.


చాలకాలమైనది. ఇంకెంతకాల మిందుండఁగలము? ఉన్నను నేమిలాభము ? మఱియు నొరులయింట నింతకాలముండుట యుచితముకాదు. దక్షిణ పాంచాలదేశములు మిక్కిలి రమ్యంబులనియుఁ బాంచాలరాజు పరమధార్మికుం డనియును మనము వినుచుందుము. అంతియెగాక, యా దేశమునందలి గృహస్థులు కోరకయే బ్రాహ్మణులను దమంత పిలిచి సత్కరించు చుందురఁట. కావున మన మింకఁ బాంచాల రాజ్యమునకుఁ బోవుద”మని చెప్పెను. ధర్మరాజాదు లామాటల కమందానందమునుజెంది, “తల్లీ ! నీ యాజ్ఞాను సారమే కావించెద"మనిరి.

ఇట్లు ప్రయాణమును నిశ్చయించుకొని, తమయింటి బ్రాహ్మణునకుఁ జెప్పి సెలవుగైకొని, యొక శుభదినంబున బాండవులు తల్లితోఁ గాంపిల్యనగరమునకు బయలుదేఱిరి. అడవులు, గొండలు, నేఱులు, నదులు దాటుకొనుచు వారు. పెక్కుదినములు ప్రయాణము చేసిరి. ఒకనాటి ప్రయాణములో వారికి మార్గమధ్యమున మహావిష్ణు సమానుఁడగు వ్యాసమహర్షి కానవచ్చెను. పాండవులును గుంతియు మిక్కిలి భక్తివినయములతో నాతనికి నమస్కరించిరి. వ్యాసుఁడు వారియెడఁ బసన్నుఁడై , “ధర్మమూర్తులగు మీ కందఱకు శుభంబగుఁగాక ! మీ రుపేక్షించక కాంపిల్య నగరంబున కేగుఁడు! అక్కడ మీకు మేలు కాఁగల” దని యాశీర్వదించి తనత్రోవం జనియెను.