పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/19

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

భారతనీతికథలు - రెండవ భాగము.

నా కామధేనువు విజృంభించి, మండు వేసంగిలోని మధ్యందిన మార్తాండ మూర్తియుంబోలె దుర్నిరీక్షయై యొక్క మారంగవిక్షేపంబు గావించెను. తోడనే భయంకరమగు నంగారవృష్టి కురియసాగెను. మఱియు నందినివాలంబునుండి శబర సేనలును శకృస్మూత్రములనుండి శక యవన పుండ్ర పుళింద ద్రవిళ సింహళ సైన్యములును, ఫేనంబునుండి దరద బర్బర సైన్యములును జనించినవి. ఇట్లుజనించి శత్రుసైన్యములకంటె నధిక సంఖ్యాకంబులై యాయధ్బుత సైన్యములు విశ్వామిత్రుని సేనలనెల్ల నిముసములో నేలపాలు గావించెను.

అట్టి బ్రహ్మతేజో జనితంబైన ప్రభావంబుచూచి విశ్వామిత్రుఁడు లజ్జావనత వదనుఁడై తన క్షత్రబలమును నిందించి యెల్లబలంబులకు మిక్కిలి తపోబలంబెయని తెలిసికొనెను.

చ. పొలుపగు రాజ్యసంపదల భోగములెల్లఁ దృణంబుగామదిం
    దలఁచి విరక్తుఁడై విడిచి దారుణశైల వనాంతరంబులన్
    వెలయఁ దపంబుసేసి గుణవిశ్రుతుఁడై పడసెన్ మహాతపో
    బలమున సర్వసంపదలు బ్రహ్మఋషిత్వముదివ్యశక్తియున్.