పుట:Bhaarata-Niiti-Kathalu2.pdf/13

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

8

భారతనీతికథలు - రెండవ భాగము


మున్నెవ్వరికి నెందును భయంపడనివాఁడను. నేడు నీయెడ భయార్తుఁడ నైతిని. ప్రాణదానముగావించినన్ను రక్షింపుము . గాంధర్వ వివాహంబున నన్ను వరింపు"మని ప్రార్ధించెను. రాజు మాటలకు లజ్ఞావనతవదనయైన యా మదవతి కొంతవడికి మొగంబెత్తి, రాజేంద్రా! భువనైక దీపకుండగు సవితృనకు నేను దనూజను. సావిత్రి కనవరజను. తపతియనుదానను. నా యందు నీకుఁ బ్రియంబుగలదేని మాతండ్రినడుగుము, అతండు నన్ను నీ కీయఁగలండు. ఇట్టి సందర్భముల గన్యలకు స్వాతంత్ర్యంబు లేమి నీ వెఱుఁగుదువుగదా! కావున నాకై యాదిత్యు నారాధింపు" మని చెప్పి, తపతి సూర్యమండలమున కరిగెను.

తపతి యరిగినంతనే సంవరణుండు మూర్చాగతుండయ్యెను. ఆప్పుడు వాని మంత్రులలో నొకండువచ్చి రాజును శీతలోపచారంబుల సేదదీర్చేను. సంవరణుఁడా పర్వతమున సూర్యునతిభక్తి నారాధించుచు నొకనాడు తన పురోహితుఁడైన వసిష్ఠమహర్షినిఁ దలంచుకొనెను. బ్రహ్మసమానుండును మహాతపశ్ళాలియు నగు వసిష్ఠమహాముని వానికిఁ బ్రత్యక్షమై వ్రతోపవాస కృశీభూత శరీరుండై యున్న ప్రభువుంజూచెను . చూచి, చూచినమాత్రముననే యాతఁడు తపనత నూజయైన తపతియందు బద్ధానురాగండై యుండుట యోగదృషిచే గ్రహించి సంవరణునకు శుభంబొనగూర్ప నిశ్చయించి, యాక్షణమయప్రతిహత ప్రభావుండగు నమ్మునికుల తిలకుండ సంకల్పమాత్రంబుననే యాదిత్యమండలమును సమీపించి,