పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/89

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"పద్యకావ్యమును రచించువారు దానిని పఠనయోగ్యము చేయవలె ననిన వ్రాయుటకు బూర్వము, దాని యాద్యంతములను బాగుగ యోచించవలెను. అటులనే, జీవిత కాలము. దానిని గడపుటకు తిన్ననిమార్గము వేయనందున, నేను చిక్కుదారులలోబడి, మార్గము తప్పితిని. నాగార్హస్థ్య ధర్మము మారినది గనుక, కొన్ని నిబంధనలను నియామకముల ననుసరించి, నాజీవితకాలమును జ్ఞానివలె గడపుటకు నిశ్చయించి, ఈ దిగువ నిబంధనలను వ్రాయుచున్నాను.

" (1) ఋణములను తీర్చువఱకు నేను మితముగ ధనమును వ్యయము చేయవలెను.

(2) ఎల్లపుడు సత్యమును బలుకుదును. - నేను నిర్వహించుటకు శక్తిలేని కార్యములయం దితరుల కాశకలిగించను. మనోవాక్కాయ కర్మములలో సౌజన్యతను చూపింతును.

(3) పూనినపనిని పూనికతో తుదముట్టించెదను, స్వకర్మమును విడిచిపెట్టి, ధనార్జన కితరపనులను చేయను. శ్రద్ధవహించి, యోర్పుతో బనిని చేయుటయే ధనార్జనకు మార్గము.

(4) ఇతరుల దుర్గణముల నెంచను. వారి సుగుణములనే యెంతును. ఇతరు లన్యాయముగ దుర్గుణ మొకనియం దారోపించినను, సమయము చిక్కినపు డెల్లవాని సుగుణముల జెప్పుదు"నని బెంజమిను వ్రాసెను.