పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గై లెండు" దీవి యొడ్డున ప్రబలముగ గాలి, వీచుచు, కెరటములు భయంకరముగ గొట్టుకొనుచున్నందున, పడవ గుద్దుకొనునను భయము కలిగి, దానిని జాగ్రత్తతో గడపి, వీ రొడ్డునవచ్చి చేరిరి. సముద్రపు టొడ్డునకు కొందఱు మనుజులు వచ్చుట వీరు చూచి, గట్టిగ కేకలువేసి వారిని వీరు పిలిచినను, కెరటముల ధ్వనిచే, వారు వినలేదు. 'రం' సారాబుడ్డి తప్ప, పడవలో తినుబడి పదార్థములేవియు లేనందున, వీరాకలికొనిన వారైనను, గాలి తగ్గువఱకొడ్డున గూర్చుండవలసి వచ్చెను. పడవలో నిదురపోవలెనని వీరు ప్రతత్నించిరిగాని, గాలి హోరున వీచుచు, కెరటముల తుంపరలుమీద పడుటవలన, రాత్రి యంతయు నిదురలేక శ్రమతో గడిపిరి. మరుసటి దిన ముదయముననే గాలి తగ్గినందున, పడవను దీసి గడపుట కారంభించి, యపరాహ్ణము తిరిగిన పిదప, 'అంబాయి' యను పట్టణమును జేరిరి. ముప్పది గంటల కాలము నిద్రాహారములు లేక గాలి దెబ్బలు తిన్నందున, బెంజమిను దేహమంతయు బడలి సలసల లాడెను. ఉష్ణము వచ్చుటకు పూర్వము శీతలోదకమును విస్తారము బుచ్చుకొనిన తగ్గునని చదివిన సంగతి బెంజమిను జ్ఞప్తికిదెచ్చుకొని, చల్లని నీరు సంతుష్టిగ త్రాగి, విశ్రమించి, నిదురపోయి, మరుచటి దినముదయమున నుష్ణపు చిహ్నములు స్వస్థతతో లేచెను.