పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'కోరాన్టు' పత్రికను నలుగురు శ్లాఘించుచుండిరి. కడమ పత్రికలేక రీతిని నుండుటచే విరసములై యంతగ శ్లాఘనీయములై యుండలేదు. "కోరాన్టు" పత్రిక లోక వార్తలను, వ్యాసములను, కట్టుకధలను, ప్రకటించుచు తాత్కాలిక వ్యవహారములను నిష్పక్షపాతముగ విమర్శించుచుండెను. ఇట్లు ధైర్య స్థైర్యములతో గూడిన దగుట, నిది పురవాసులకు అనుకూల ప్రతికూల విషయములను చర్చింపునెడ వారికి క్రమముగ హర్ష రోషములను బుట్టించుచుండెను.

ఇక్కాలమంతయు మన బెంజమిను యక్షరముల కూర్చుచు, వివాదాభిలాషియైనను, యే విధమైన వివాదములోను దిగక, తన పనిని చూచుకొనుచుండెను. సోదరభావ మంత:కరణ పూర్వకము కానిదిగా, సోదరు డితనిని కూలివానిగ జూచుచు, మనస్సులు కలియనందున, మాటలను వ్యయపఱచుచు, నొక్కొక్కప్పుడితనిని గొట్టుచు వచ్చెను. మరికొన్ని సమయములయందన్న దమ్ముల వివాదములను దండ్రి బరిష్కరించి బెంజమిను పక్షమున తీర్పు చెప్పుచుండెను. ఈ దుర్భావము కలవాడై, తమ్ముని యభిలాషలను చదువును గుర్తెఱుంగ లేనందున, 16 సంవత్సరముల యీడురాకపూర్వమె, బెంజమిను యించుమించుగ శైలిలోను ధోరణిలోను 'అడిసను'ను పోలి వ్యాసములను వ్రాయుశక్తిగలవాడను సంగతి యన్న తెలిసికొనజాలడయ్యె.