పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/141

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

"నీటిలో మునిగి, చచ్చిన వారిని బ్రతికించుటకు వారి కళేబరములను తైలద్రోణిలో నుంచు విధమును గనిపెట్టిన బాగుగ నుండునని నేను తలంచెద"నని ముగించెను. ఇతడీ కాలములోనే "స్కాట్లండు, ఐర్లండు, ఫ్రాన్సు" దేశములను జూచుటకు వెళ్లెను.

ఇంతకాలమునకు స్వదేశమునకు బోవలెనని బెంజమిను సమకట్టెను. పదిసంవత్సరము లయి, దారాపుత్రాదుల విడనాడి పరదేశమం దితడుండెను. ఇతడు ప్రయాణసన్నాహము జేయుచుండెను. కొంతకాలము గృహిణి బెంజమిను స్వస్థత లేక బాధపడుచుండెను. కాని, యామె కపాయము గలుగునని స్నేహితులెవ రనుకొనలేదు. ఇంతలో నామెకు పక్షవాతమువచ్చి, నాలుగయిదు రోజులు శ్రమపడి, యామె పంచత్వమును బొందెను. ఈ సమాచారము బెంజమినుకు దెలిసెను. నలుబది నాలుగు సంవత్సరములు వీరు గృహస్థాశ్రమములోనుండి, నిష్కళంకముగ దాంపత్యసుఖము ననుభవించిరి. ఇతడు గృహమును విడిచి, పరదేశములో నుండిన కాలమున, భార్యాభర్త లన్యోన్యముగ వ్రాసికొనిన యుత్తర ప్రత్యుత్తరములు చదివిన, వారి యనురాగము వెల్లడి యగును. సమయము వచ్చినపు డెల్ల నామె సుఖజీవనముకు తగినవస్తువుల నితడు పంపుచుండెను.