పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/120

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొని విరాగముతో వీనిని భరింతును. యుక్తాహారము పుచ్చుకొనుట చేత, నిరోగిగ నుంటిని" అని, 79 సంవత్సరములు వయస్సున బెంజమిను వ్రాసెను.

ధర్మాచరణ కష్ట సాధ్యమైన పనియని తెలిసి, "ముక్తులయు స్వాస్థ్యులయు సంఘము"లో బ్రవేశించుటకుముందు, ప్రతివాడును, పదమూడు వారములలో కనీస మొక వారమైన నాత్మ పరిశోధన జేసినగాని యర్హత కలుగ దని బెంజమిను నిబంధన చేసెను. సంఘము మాత్రము సమకూడలేదు. వ్యవహారము దట్టమయినందున, దీని విషయమై శ్రద్ధవహించుట కతనికి వీలులేకపోయెను.

1733 వ సంవత్సరములో భాషలను చదువుట కిత డారంభించి, కొద్దికాలములో, "ఫ్రెంచి, ఇటాలియా, స్పానిషు" భాషలను వ్రాయను చదువను నేర్చెను. ఇతనికి చతురంగము నాడుటయం దతిప్రేమ గనుక, కొంతవఱ కితడు 'ఇటాలియా' భాషను వేగముగ నేర్చుకొనుటకు వీలుకలిగెను. ఇతనివలె నిటాలియా భాషను నేర్చుకొనుచున్న స్నేహితు డొకడు, బెంజమిను చదువును మాని యాటకు వచ్చినటుల జేయుచుండెను. ఓడినవాడు మరల యాటకు వచ్చులోపున క్రియాపదములను వర్ణించుటయో లేదా భాషాంతరీకరణము చేయుటయో యీ రెండు