పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/104

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కసాధ్యముగ నున్న కాలములో నది తీరుమానముకు తటస్థమగును. అన్ని వాయిద్యములు వాయించి, నాలుగు వైపుల నుండి ధనమువచ్చు నేమోయని చూచుచు, మునుగుచున్న వ్యాపారమును లేవనెత్తుటకు సమర్ధుడుగనున్న బెంజమినుకు ఋణము సంగతిని జ్ఞాపకము తెచ్చుటకు, వెర్నను మృదువుగ నొక లేఖను వ్రాసిపంపెను. తన తప్పు నొప్పుకొని, కొంచెము కాలము గడువుచేయ మని బెంజమిను ప్రత్యుత్తర మతనికి వ్రాసెను. అటుల గడువుచూపినందున, నేడు సంవత్సరముల నుండి బాధించుచున్న ఋణము నసలువృద్ధులతో దీర్చుటకు కొద్దికాలములో నితని కవకాశము జిక్కెను.

ఇదివఱకు, సర్కారుకు కావలసిన కాగితములను 'బ్రాడుపర్డు' ముద్రించుచుండెను. ఇతడు కొన్ని లోపములు చేసినందున, వీని మానిపించి, వా రాపనిని బెంజమినును చూడమనిరి. ఇందు మూలమున, 'బెంజమిను మెరిడిత్తు' ల కంతగ లాభము లేకపోయినను, కొంతవఱకు వీరికి పేరువచ్చి, వీరు నిలబడుట కవకాశమయ్యెను.

రెండు సంవత్సరములనుండి కష్టపడుచున్నను, జీవనాధార మస్థిరమై, బెంజమినుకు పని నిలకడతో నుండగల దనునమ్మకము లేక పోయెను. వెచ్చము పెట్టిన 200 కాసులలోను సగము సొమ్మును 'తండ్రిమెరిడిత్తు' జాగ్రత్తచేయకలిగెను.