పుట:Ben'jaminu phraan'klinu jiivita charitramu.pdf/100

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

యుండిరి. వారిగృహములకు నన్ను పిలుచుకొనివెళ్లి, వారి స్నేహితుల దర్శనము నాకు జేయించుచుండిరి. కీమరు నేను పొందిన మర్యాదను బొంద లేదు. నిజముగ, కీమరు వెర్రిబాగులవాడు. ప్రపంచరీతిని దెలియనివాడు. జనసమ్మతాభి ప్రాయములను కాదనువాడు. రోతను పుట్టించునం తవలక్షణముకల వాడను" అని గర్వముగ బెంజమిను వ్రాసెను.

ఇదివఱలో వ్రాసినప్రకార మింగ్లాండునుండి, 1728 సంవత్సరము ప్రారంభమున, నచ్చుయంత్రము, కూర్పులువచ్చినందున, కీమరుతో వ్యవహారమును చక్క జేసికొని, మెరిడిత్తు బెంజమినులు కలిసి, ముద్రాక్షరశాలను స్థాపించుటకు సమకట్టిరి.

ఈకాలములో నే బెంజమిను, తనగోరీమీద వ్రాయవలసినదిగా నీ దిగువ చరణమును వ్రాసెను. "ముద్రకుడైన బెంజమినుయొక్క దేహము (అక్షరములు మాసిపోయి, ప్రాతగిలిన గ్రంథముయొక్క యట్టవలె), క్రిమికీటకముల కాహారమై, యిక్కడనున్నది. ఈ గ్రంధము నాశముపొందక, సృష్టికర్తచే దిద్దబడిసవరణచేయబడి, దీనికంటె రమ్యమైనకూర్పులో వేయబడి, తిరిగి ప్రచురింపబడు నని వాని నమ్మకము."