పుట:Baarishhtaru paarvatiisham.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దొరుకుతవని వ్రాసివుంటే చూసి, ఇది కాస్తదగ్గిరుంటే నయము కదా అనుకుని రెండు డబ్బాలు కొనుక్కుని నిమ్మళంగా ఆ సత్రము చేరుకున్నాను.

రాత్రి భోజనము చేసి సావకాశంగా ఇంటికి ఉత్తరము వ్రాదామునుకుని పెట్టితీసేసరికి కాగితముగాని కలముగాని ఏమీ కనపడలేదు. సరే ఇదొకటిబజారు వెళ్ళి కొనుక్కోవాలిగదా అనుకుని ఆ రాత్రి సుఖంగా పడుకున్నాను.

మర్నాడు ప్రొద్దునే బజారుకు వెళ్ళి వుత్తరములు వ్రాసుకోడానికి కాకితాలూ కవర్లూ ఒక పౌంటెన్ పెన్నూ, అందులోకి సిరా, ఒక పెన్సలూ, జమాఖర్చు వ్రాసుకోవడానికి ఒక చిన్న ఎక్సరసైజు బుక్కూ, కొనుక్కుని ఇంటికి వచ్చాను.

వచ్చి ముందు వుత్తరమువ్రాసి పోస్టులో వేస్తే తీరిపోతుందని వుత్తరము వ్రాయడ మారంభించినాను.

క్షేమము కొలంబో


శ్రీ వేదమూర్తులైన బ్రహ్మశ్రీ వేమూరి రామచంద్రయ్య నాన్నగారికి;

తమ కుమారుడు పార్వతీశం అనేక నమస్కారములు చేసి చేయంగల విన్నపములు, ఉభయ కుశలోపరి, పై చిరునామా చూసి ఈ కొలంబో ఏమిటి? ఎక్కడుంది? ఎక్కడున్నా, నేనిక్కడికి వెళ్లడానికి కారణ మేమై వుంటుందని ఆశ్చర్య పడవచ్చును. ఇది సింహళద్వీపానికి ముఖ్యపట్టణము, అనగా పూర్వము మనము రావణాసురిడి లంక అనుకునేవాళ్లమే, అదే సింహళ