Jump to content

పుట:Baarishhtaru paarvatiisham.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

బారిష్టరు పార్వతీశం పుట్టుపూర్వోత్తరాలు

పార్వతీశం పుస్తకం చదివిన వాళ్ళు చాలామంది, 'ఈ ఆసామీ, ఎవరండి ' అనో, 'ఎవరిమీద రాశారండీ? అనో, 'అసలిలా రాయాలని ఎలా తోచిందండీ' అనో, అడుగుతూ ఉండడం కద్దు, అలాగే ఆమధ్య రేడియో వారు కూడా 'వాడి పుట్టుపూర్వోత్తరాలు ఏమిటో నాలుగు ముక్కలు చెప్పండి ' అన్నారు. వారికి చెప్పిన సమాధాన సారాంశం ఈ క్రింది సమాచారం.

దేనికైనా పెట్టి పుట్టాలంటారు: లేదా ముఖాన్నివ్రాసి ఉండాలంటారు మన వాళ్ళు. ఒక్కొక్క ముఖం చూస్తే ముచ్చటవుతుంది. మరో మాటు ఆ ముఖం చూడవలెననీ, వారి పరిచయం చేసుకోవలెననీ అనిపిస్తుంది. వారి పుట్టుపూర్వోత్తరాలు తెలుసుకోవలెననే కుతూహలం కలుగుతుంది. అలాటి అదృష్టవంతుడు మా పార్వతీశం. అదంతా, అతని ముఖారవిందం, జన్మనక్షత్ర ఫలమూను.