పుట:Baarishhtaru paarvatiisham.pdf/89

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


సాగిందికాదు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళితే అక్కడికి కూడా తరుముకు వస్తున్నది. ప్రపంచములో ఇంత న్యాయబుద్ధి ఉందని ఇదివర కెప్పుడూ అనుకోలేదు. ఏ వస్తువైనా ఎక్కడైనా మరచిపోతే మళ్ళీ ఇక అది దొరకడము దుర్లభమని చాలామంది చెప్పారు. ఆ అభిప్రాయము సరికాదని ఇప్పుడే తేలింది. ఏదైనా ఎవళ్ళకైనా అనుభవములోనికి వస్తేగాని తెలియదు. ఇక ముందెప్పుడైనా ప్రపంచములో అన్యాయమూ, దొంగతనమూ ఉందని చెపితే నేను నమ్మను. ఇక ఈటోపీ ఎక్కడ మరిచిపోయినా నన్నుకూడా వెంబడించేటట్టున్నది. అందుకని మాట్లాడకుండా యీసారిమట్టుకా టోపీ తీసుకుని ఎవళ్లూ చూడకుండా ఏ అర్ధరాత్రివేళో నడిసముద్రములో గిరాటు వేస్తాను. లేకపోతే మళ్ళీ సముద్రములోనైనా, పగలు పారేస్తే ఏ దౌర్భాగ్యుడో చూసి అది వలవేసి తీసి మళ్ళీ తీసుకు వచ్చి ఇస్తాడేమోనని భయము వేస్తున్నది. ఆ టోపీ చూస్తే మట్టుకు నాకు మహా చెడ్డ అసహ్యం! బోలెడంత ఖరీదు దాని మొహాన్ని తగలెయ్యడమే కాకుండ పైగా అది పారేసి పోతూ ఉంటే వెనుకనుంచి తీసుకువచ్చి యచ్చిన ప్రతివాడికి ఏదో బహుమతిచేసి నా కమిత ప్రియతరమైన వస్తువేదో పోకుండా తీసుకువచ్చినట్టు సంతోషము కనపరచాలి. ఇంతమట్టుకి- సహించడమే చాల కష్టము. ఈ మాటుకింక తప్పదు గనుక మళ్ళీ ఆ తెచ్చినవాడి ముఖాన ఒక పావలా తగలేసి ఆ దరిద్రపు టోపీ తీసుకుని బండిదగ్గరకు వెళ్ళాను.

చెన్నపట్నములో వచ్చిన చిక్కే యిక్కడాను; అక్కడ కలిగిన సందేహమే ఇక్కడాను; ఎక్కడ బస చేయడమా అని. ఇక్కడి దరిద్రులకూ రాదు తెలుగు. చెన్నపట్నములో