పుట:Baarishhtaru paarvatiisham.pdf/83

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన పక్షాన్ని వున్నాడనుకొన్నాను, స్టీమరుమీద మనకు భోజనము ఎవరు పెడతారు, ఎందుకు పెడతారు ఏమి పెడతారన్న సంగతేమీ ఆలోచించలేదు. ఏదో ఆహారమంటూ కొంత లోపలపడి ప్రాణమంటూ కొంత నిలిస్తే తక్కిన సంగతులు తరువాత ఆలోచించవచ్చు ననుకున్నాను.

తిన్నగా నాస్నేహితుణ్ని అనుసరించి నడిచాను. ఇప్పుడు చూసిన గదే అనుకుంటే అంతకంటే తమాషాగా ఉంది ఈ గది. గదికి మధ్య పెద్ద పొడుగాటి బల్ల వుంది.దానిపైన తెల్లనిగుడ్డ పరిచారు. దానిమీద చక్కని పింగాణీ పళ్ళాలూ, గాజు గ్లాసులూ, కత్తులూ, చంచాలూ ఇంకా ఏమేమిటో వున్నాయి. మేము ప్రవేశించేటప్పటి కప్పుడే కొంతమంది వచ్చి కుర్చీలమీద కూచున్నారు. మేమూ వెళ్ళి చెరి ఒక కుర్చీ అలంకరించాము.

కూచుని నాస్నేహితుణ్ని ఈ కత్తులూ, కఠార్లూ ఎందుకు భోజనము చేసేచోట అని అడిగాను. సిగ్గు విడిచి అడిగి తెలుసుకోకపోతే మాట దక్కేటట్లు కనబడలేదు. ఇంకోనిమిషానికి వడ్డన అవడము, భోజనానికి కూచోడము సంభవిస్తుంది. ఇంకప్పుడు వెర్రిమొహము వేస్తే బాగుండదు. అందుకని ముందే తెలుసుకునివుంటే మంచిదని యుక్తిగా నేను వట్టి అజ్ఞానుణ్ని అని అతను అనుకోకుండా గడుసుతనంగా అడిగాను. అడుగుతే పాపము ఆ పెద్దమనిషి చెప్పాడు వాట్ల వుపయోగము.

ఇంక వడ్డన ఆరంభించ బోతున్నారు. ఈ కత్తులూ అవీ వుపయోగించడము మనకు చేతవుతుందో కాదో చూదా మను