Jump to content

పుట:Baarishhtaru paarvatiisham.pdf/81

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

తెలిసింది. ఇప్పుడు ప్రాణభయమేమీ లేదని ధైర్యము కలిగింది. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళవలసిన అవసరము లేదుకదా అనుకున్నాను. దానితోటి కొంత ధైర్యము తెచ్చుకుని తలనొప్పి ఇంకా బాధిస్తున్నా అందరితోటిపాటూ నేనూ లేచాను పైకెక్కడానికి. లేచి నా సామాను దగ్గిరికి వెళ్ళి తీసుకోపోయాను. అక్కడొతత నుండి నేను వెళ్ళవచ్చుననీ, సామాను వెనుకనుంచి వస్తుందనీ చెప్పాడు. సామానంతా అలా విడిచిపెట్టి వెళ్ళితే ఏమి కొంప మునుగుతుందో అని భయపడ్డాను. మళ్ళీ వాణ్ని ఒక మాటు 'సామాను జాగ్రత్తగా వస్తుందా' అంటే, 'వస్తుంది ' అని ధైర్యము చెప్పాడు. ఇది కాకుండా తక్కిన వాళ్ళంతా కూడా వాళ్ళ సామాన్లు విడిచి వెళ్లుతున్నారు. అందుచేత పరవాలేదుకదా అనుకుని అంతసేపటినుంచీ చేతులోవున్న దొరసాని టోపీ మట్టుకు పుచ్చుకుని తక్కిన వాళ్లతోటిపాటు నేనూ నిమ్మళంగా పైకెక్కాను.

ఆఖరి మెట్టెక్కి లోపలికి తొంగి చూచేటప్పటికి నాకు చాలా ఆశ్చర్యము వేసింది. స్టీమరంటే మామూలు రాధారి పడవల కంటే బాగా పెద్దదిగావుండి రెండు మూడు పెద్ద హాలులు అందులో బల్లలు వుంటాయి కాబోలు అనుకున్నాను. తీరా చూస్తే ఇదొక పెద్ద మహారాజభవనములా వున్నది. లోపలంతా చక్కని దీపాలు, నేలమీద తివాసులూ, గొప్ప గొప్ప సోఫాలూ, కుర్చీలూ, బల్లలూ సమస్తమూ వున్నాయి. ఇంకా మంచాలూ పరుపులూవేసి పడుకోడానికి వేరే గదులు, స్నానాల గదులు, పాయఖానాలు, వంటయిళ్ళు, భోజనాల సావిళ్ళు అన్నీ వేరు వేరుగా వుండేటట్లు వున్నాయి అనుకున్నాను. అయినా మళ్ళీ