పోతున్నట్లు దగ్గిరికిచేరి పెద్ద స్టీమరు సరాసరినే నిలబడ్డది. పైకి చూస్తే తాడి ఎత్తున నల్లగా గొడపెట్టినట్టు పెద్ద స్టీమరు కనబడుతున్నది.
తలనొప్పితోటైతేనేమి వికారముతోటైతేనేమి భయముతోటైతేనేమి, నా ఒళ్లు కంపమెత్తిపోతున్నది. అదివరకు ఏమూలైనా కొంచెము ధైర్యముంటే అదికాస్తా యిప్పుడు భగ్నమైంది. ఇంక ఎవళ్లు ఏమన్నా, ఎన్ని అన్నా, ఎంతనవ్వినా, ఇంటికి వెళ్ళడమే మంచిదనుకున్నాను. నవ్వేవాళ్ళకేం, నవ్వుతారు. పోయేది నాప్రాణముకాని వాళ్ళది కాదుగదా. ప్రాణముపోతే నవ్వేవాళ్ళెవరూ వాళ్ళ ప్రాణమివ్వరుకదా. ఈ వచ్చింది, చూసిందీ చాలు. ఈమాత్రమేనా యిల్లు కదలడము ఈ వంకవల్ల కలిగింది. చెన్నపట్నములో ఇంకోవారము రోజులుండి సరదాగా అన్నీ చూసిపోదామని నిశ్చయము చేసుకున్నాను.
ఇంతలోకే ఆ స్టీమరువాళ్ళూ యీ స్టీమరువాళ్ళూ మాట్లాడుకోడము, ఏదో కేకలు వేసుకోడ మయినతరువార పైనుంచి ఒక నిచ్చెన దింపారు. నిచ్చెన తిన్నగా మాస్టీమరులోకంటా వుంది. నిచ్చెనకు పైన ఒక పెద్ద దీపముంది. నిచ్చెనకూడా ఏదో ఒక మోస్తరు తాడునిచ్చెనకాకుండా చక్కగా విశాలమైన మెట్లూ, పక్కల పట్టుకోడానికి కర్రకమ్ములూ అవీవుండి మామూలు మేడమెట్లలాగే వున్నాయి. మా స్టీమరుకూడా నేనుభయపడ్డట్టు కెరటాలమీద ఆకాశమండలాని కెగురుతూ పాతాళానికి దిగుతూండకుండా, కొంచె మించు మించుగా కదలకుండానే వున్నది. ఇదంతా చూస్తే నే నిదివరకు విన్నదంతా అబద్ధమని