పుట:Baarishhtaru paarvatiisham.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నమ్మకమేమిటి? ఉంటేమట్టుకు అంత దాకా ప్రాణము నిలుస్తుందో నిలవదో? ఒకవేళ నిలిస్తే ఈ లోపల ఏ పెద్ద చేపైనా వచ్చి మన్ని ఫలహారము చేస్తే గతేమిటి? ఈ మోస్తరుగా పరి పరి విధాల ఆలోచన పోయింది. చిన్నప్పుడు ఈత నేర్చుకోక పోయినందు కిప్పుడు విచారించాను. పోనీ మాట్లాడకుండా దీని మీదనే తిరిగి వెనక్కు వెళ్ళిపోదామా అనుకున్నాను. సరే ఇంత తొందర ఎందుకు, ఒక్కక్షణము ఓపికపడితే అంతా తెలుస్తుందికదా. అప్పుడే వీలయితే అలాచేయవచ్చునుకదా అనుకున్నాను. ఇంక ఎప్పుడు పెద్ద స్టీమరు చేరుతామా అని ప్రాణాలు ఉగ్గపట్టుకొని గుండె రాయి చేసుకుని ఒక్క మాటు ఇంటిదగ్గిరున్నవాళ్ళను తలుచుకుని పొంగివస్తున్న దుఃఖాన్ని ఆపుకొని శ్రీరామ స్మరణ చేసుకుంటూ కూచున్నాను.

స్టీమరు బహు తొందరగా సముద్రాన్ని చీల్చుకుని పరుగెడుతూ ఉంది. బొంయ్ మని ఇంజనులధ్వని, హోరుమని సముద్రమూ, నాపక్క నున్నవాళ్ళ మాటల సందడితోటి నాతల నొప్పి మరింత అధికమైంది. కళ్ళు తెరిస్తే ప్రపంచమంతా గిర్రున బొంగరములా తిరిగి పోతున్నది.

ఇంతలోకే అదుగో స్టీమరంటె, అదుగో స్టీమరన్నారు. దానిమీద దీపాలుతప్ప ఇంకేమీ కనబడలేదు. ఈ చిన్నస్టీమరు కొంచెము నెమ్మదిగా వెళ్ళితే బాగుండును. లేకపోతే చీకటిచాటున దాన్ని కొట్టుకుంటుందేమోనని భయపడ్డాను. నేనను కున్నట్టు గానే కొంచెము జోరు తగ్గించారు. నెమ్మదిగా దాని దగ్గిరికి చేరాము. మాదానికంటే అది చాలా పెద్దదిగా, కొండలాగ ఎదురుగుండా ఉన్నది. మా స్టీమరు బహు నెమ్మదిగా హడిలి