పుట:Baarishhtaru paarvatiisham.pdf/77

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


నా బోటివాడు ఇంకొకడు బయలుదేరితే భరించలేక పోయేవాళ్ళు ఆంధ్రులు.

కొంచెము సేపటికి పగల స్తమానమూ బోజనములేని కారణాన్నో, ఎందుచేతనో కాని వుపద్రవమైన తలనొప్పి ఆరంభించింది. కాస్త ఎక్కడయినా ఒరుగుదామా అంటే ఎక్కడా ఖాళీలేదు. అలాగే తల పట్టుకు కూర్చుండగా వికారముకూడా ఆరంభమైంది. ఏమిరా దేవుడా ఎలాగు, కొంపతీసి జ్వరము వచ్చి పడిపోనుకదా! ఇంతదూరము వచ్చి మళ్లీ వెనక్కు వెళ్ళవలసి రాదుకదా! అన్నిటిమాటా అలా వుంచి మళ్లీ యింటికి వెళితే నలుగురిలోనూ హాస్యాస్పదముగా వుంటుందే అని ఏమీతోచక కండ్లుమూసుకుని కూచున్నాను.

ఈ అవస్థలో ఇలావుండగా ఇంకో ఆలోచన తోచింది. దానితోటి మరీ హడిలిపోయాను. ఆ ఆలోచన మొట్ట మొదటనే తోస్తే ఎవళ్లేమన్నాసరే, నవ్వినా సరే, తిట్టినా సరే, మాట్లాడకుండా తిరుగురైలులో ఇంటికి జేరుకునేవాణ్ని. ఇప్పుడేమి చేయను! వెనక్కు తగ్గడానికి వీలు కనపడదు. ముందుకు సాగితే బతికే ఎత్తు కనుపించదు. ముందుకు వెడితే నుయ్యి, వెనక్కి వెడితే గొయ్యి లాగుంది నా బ్రతుకు. ఏమీతోచదు. ఇంకొకళ్ళ సలహా అడగడానికి మనసొప్పదు. ఒక్కసారి ఇంటిసంగతి జ్ఞాపకము వచ్చింది. ఆహా! ఎంత తెలివి తక్కువపని జరిగిందనుకున్నాను. నా కింగ్లండు వెళ్ళమని సలహా యిచ్చినవాణ్ణి నోటినిండా తిట్టాను. ఒక్కడినే కొడుకునని నామీద ఎంతో ఆశపెట్టుకున్న నా తల్లి దండ్రు లెంత విచారిస్తారోకదా అనుకున్నాను. ఏమనుకుంటే ఏమిలాభము!