అంతా చూస్తే నాకు చాలా సంతోషము వేసింది. కాని స్టీమరిదేనని చెప్పేటప్పటికి మట్టుకు ఎక్క బుద్ధయింది కాదు. బొత్తిగా చిన్నదిగా వుంది, మామూలు రాధారీ పడవంతయినా లేదు. స్టీమరైతే మట్టుకు అంత చిన్నదాంట్లో సముద్రం మీద వెళ్ళడము ప్రమాదము కాదా అనుకున్నాను. దీని మీదనే వెళ్ళవలసి వుంటే, ఇంతకంటే మళ్ళీ యింటికి వెళ్ళడము నయమనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ నిలుచుండగానే కూలి వాడు సామాను లోపల పెట్టేసి నన్నెక్కమని తొందరపెట్టాడు. ఇదేనా ఏమిటి కొలంబో వేళ్ళే స్టీమరు అన్నాను. 'కాదండి. పెద్ద స్టీమరు అయిదారు మైళ్ళు దూరాన లోపల వుంది. ఇది దానిదగ్గరికి తీసుకువెడుతుంది. ఎక్కండి త్వరగా' అన్నాడు. అయితే ఫరవాలేదనుకుని ఎక్కాను. ఎక్కి అక్కడొక బల్ల మీద కూచున్నాను. కూచున్న కాసేపటికే అది బయలుదేరింది. మొత్తము జనము నాతోడి ప్రయాణీకులు పాతిక మంది కంటే వుండరు.
బయలుదేరిన ఒక అయిదు నిమిషలవరకూ చాలా సరదాగా వుంది. నీటితుంపురులు మీద పడుతూ, నేల అంతకంతకు దూరమైపోతూ, ఒడ్డునున్న దీపాలు దూరమైన కొద్దీ మిణుకు మిణుకు మంటూ, అన్నివైపులా చీకట్లు కమ్ముకువస్తూ, పైన నీలాకాశము, దానికి వ్రేలాడగట్టిన పాదరసపు బుడ్లలాగా అనేక కోట్ల నక్షత్రాలూ, కింద ఎటుచూచినా అగాధమైన సముద్రమూ, ఆ కెరటములమీద లేస్తూ దిగుతూ ఉయ్యాల ఊగుతున్నట్లు అంతా మాబాగా వుంది. నాకే కవిత్వమువస్తేనా అనుకున్నాను. ఇంతకూ ఆంధ్రుల అదృష్టము బాగుంది, నాకు కవిత్వము రాకపోవడము ఇప్పుడున్న కవులకి తోడు