పుట:Baarishhtaru paarvatiisham.pdf/69

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

కొట్టుకుంటూ ఉన్న గుండె ఒక్కక్షణ మాగిపోయింది. ఇంక మా యింటిపేరు, మానాన్నపేరూ అడిగి తెలుసుకొని ఇంటికి ఉత్తరము వ్రాస్తాడు, నాకొంప మునిగిందనుకొన్నాను.

మరొకళ్ళయితే గుడ్లు మిటకరించేవాళ్ళే! నీనింకా కొంచెము ధైర్యము కలవాణ్ని గనుక ఆగిపోయిన గుండెను ఆడించి మళ్ళీ ఆయనతోటి సంభాషణ ఆరంభించాను. 'చిత్తము, అలాగా అండి. ఇంగ్లండు దయచేశారా అండి. అక్కడ మనవాళ్ళెవరైనా ఉంటారా అండి. బసా అదీ దొరికి భోజనము అదీ సదుపాయంగా వుంటుందా అండి' అన్నాను. 'ఆ, ఉన్నారు. ఏదో కొద్దిమంది మనవాళ్ళు ఉన్నారు. మొత్తముమీద సౌఖ్యంగానే ఉంటుంది ' అని, 'అబ్బాయి, నీకక్కడ స్నేహితు లెవరైనా ఉన్నారా? అక్కడెలా నడుచుకోవాలో. ఆ దేశాచారాలేమిటో ఏమన్నా తెలుసుకున్నావా?' అన్నాడు. అనేటప్పటికి పోనీ పెద్దమనిషిగదా, అని కొంచెము గౌరవముగా మాట్లాడితే నన్ను చిన్న కుర్రాడికింద కట్టివేసి, మాట్లాడితే అబ్బాయి అనుకుంటూ, ఏమిటో దర్జాకు పోతాడేమిటి? ఈయన ఎక్కువేమిటి నా తక్కువేమిటి? ఈయనింగ్లండు ఇదివరకు వెళ్ళాడు; నే నిప్పుడు వెడుతున్నాను. అంతే తేడా. ఈమాత్రము దానికి నన్నింత అగౌరవపరచవలసిన అవసరములేదు. కాబట్టి ఈయనతో సంభాషణ ఇంక కట్టిపెడితే బాగుంటుందని ఆయన అడిగినదాని కంతా 'ఆ' అని 'ఊ 'అనీ ఏకాక్షరముతోటి సమాధానము చెప్పి, ఆయనింకా ఏమిటో అడుగుతూంటే వినిపించుకోకుండా కండ్లు మూసుకుని నిద్దరపోతున్న వాడివలె వెనక్కి జార్లపడి కూచున్నాను.