పుట:Baarishhtaru paarvatiisham.pdf/68

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది


వాడైనా అఖండుడులా ఉన్నాడు. తెలుగుకూడా బాగానే మాట్లాడాడు. ఒకవేళ తెలుగు దేశములో ఉన్నాడేమో కొంతకాలము! లేకపోతే సెకండుక్లాసులో ప్రయాణము చెయ్యతగినంత డబ్బెక్కడిది అరవవాళ్లకు, తెలుగు దేశములో సంపాదించకపోతేను? అనుకున్నాను. ఏమైతే నేమి అఖండమైన తెలివి తేటలు. మన గుట్టంతా తెరచిన పుస్తకములో చదివినట్టు నిమిషములో కనిపెట్టేశాడు. ఈయనవల్ల ఏమీ ప్రమాదము రాదు కదా అనుకుని, అయినా ఈయనెవరో, ఈయన సంగతేమిటో, సందర్భమేమిటో, అడిగి తెలుసుకుందాము. ఏలాగైనా ఈయనతోటి కొంత స్నేహముగా ఉంటేనే నయమనుకున్నాను. లేకపోతే ఇంటికి మనమీద కోపంచేత ఉత్తరము వ్రాస్తే చిక్కు. ఎందుకయినా కొంచెము జాగ్రత్తగా ఉండడమే మంచిదని 'చిత్తం తమ రూహించినది చాల భాగము వాస్తవమే. నేను ఇంగ్లండే వెడుతున్నాను. తమ దే వూరు? తెలుగుకూడా బాగా మాట్లాడుతున్నారు, తెలుగుదేశములో ఎప్పుడైనా ఉన్నారా ఏమిటి ' అన్నాను. అనేటప్పటికి ఆయన కొంచము నవ్వి 'అబ్బాయీ! మాది తిరుచినాపల్లి. నేను చిన్నప్పటినుంచీ తెలుగుదేశములోనే ఉండేవాడిని. మాతండ్రి స్టేషను మాష్టరు పనిచేసి చాలాకాలము రాజమహేంద్రవరము, నిడదవోలు, ఏలూరు మొదలైన ఊళ్ళల్లో ఉండేవారు. నేను ఇంగ్లండులో చదువుకున్నాను. ఇంజనీరు పరీక్ష అయి నేనూ చాలాకాలము మీ ధవిళేశ్వరములోనూ, సెట్టిపేటలోనూ, బెజవాడలోనూ ఉన్నాను. అందుచేత నాకు తెలుగు బాగా అలవాటు ' అన్నాడు.

దానితోటి నాకాళ్ళు చల్లబడ్డయి. అదివరదాకా తొందరగా