పుట:Baarishhtaru paarvatiisham.pdf/67

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దని చక్కాపోయాడట. అలాగ్గా నువ్వు వేరే అడగాలనా నాయనా.'

'సరే దాని కేమిలెండి. అసలేమి కనిపెట్టా రేమిటి?' అన్నాను, 'చెప్పనా, నిజము చెపితే నువ్వు ఏమన్నా అనుకుంటావేమో' నన్నాడు. 'పరవాలేదు చెప్పండి,' అన్నాను. 'నీ పెట్టెచూస్తే పల్లెటూరనీ, ఎప్పుడూ దూరపుప్రయాణము చేసి ఎరగవనీ తెలుస్తున్నది. నేను పెట్టెలోకి వస్తుంటే రావద్దనడము చూచి నీవు ఎప్పుడూ రైలుప్రయాణము చెయ్యలేదనీ, ఒకవేళ చేసినా, ఎప్పుడూ సెకండుక్లాసులో ఎక్కలేదనీ, ఎప్పుడూ పెద్ద మనుష్యులతో సంచరించలేదనీ తెలిసింది. అందుచేత ఇంతపల్లెటూరివాడవు నిజంగా ఇంగ్లండు వెళ్ళుతున్నావేమో అనుకున్నాను. లేకపోతే నువ్వు కొలంబో వెళ్ళడానికి తగిన కారణమేమీ కనుపించదు. ఆపైన నాటుకోటిసెట్టి తలలా వున్న నీ తలకాయ చూస్తే నీకు క్రాపింగ్ అలవాటు లేదనీ, జుట్టు వుండేదనీ, అది ఇవ్వాళే తీసివేయించావనీ తెలుస్తూవుంది. కొలంబో దాకానే ప్రయాణ మైనట్లయితే జుట్టు తీసివేయించవలసిన అవసరములేదు. అందుచేత ఇంకా పైకి వెడుతున్నావని రూఢి చేశాను. ఇంట్లోకూడా చెప్పకుండా వెళ్ళుతున్నావని నా అనుమానము. లేకపోతే బొంబాయి వెళ్ళకుండా కొలంబో ఎందుకు వెళ్ళుతావు? ఏమంటావు, నేచెప్పింది నిజమా అబద్ధమా? వున్నమాట చెప్పు. మీవాళ్ళతో చెప్పనులే' అన్నాడు.

ఆయన మాట లొక్కక్కటే వింటూంటే నాపై ప్రాణాలుపైన ఎగిరిపోయినయి. ప్రపంచములో ఇంతమందిని చూశాను కాని ఇలాటివాడిని మట్టు కెప్పుడూ చూడలేదు. ఈయన అరవ