పుట:Baarishhtaru paarvatiisham.pdf/66

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

ఏమీ తోచక నా తోటిప్రయాణము చేస్తున్న పెద్ద మనిషెవరో ఒకసారి చూద్దామనుకుని అదివరకు చూస్తున్న వాణ్ణి లోపలికి తిరిగి చూశాను. ఆయన నాకేసి అదివరకే నిదానంగా చూస్తున్నాడు. మాయిద్దరి కండ్లూ కలుసుకున్నాయి. 'మీ దేవూరండి ' అని అడిగాడు ఆయన. నర్సాపురమన్నాను. మా ఊరు నర్సాపురము కాకపోయినా, మొగిలితుర్రు అని చెప్పితే ఆయనకు తెలియకపోతుంది. మళ్ళా అదెక్కడని అడగడము, నేను చెప్పడము, ఇదంతా ఎందుకని నర్సాపురమంటే చులాగ్గా తెలుస్తుందని యిలా చెప్పాను. మీ రెందాకా వెళ్ళుతున్నారన్నాడు. ఏదో సామాన్యంగా తరచు వెడుతూనే వుంటాననే భావము కలిగేటట్టు, 'ఇక్కడికే కొలంబోదాకా వెడుతూ ఉన్నాను ' అన్నాను. అలాగా అని నాకేసి నిదానంగా చూసి 'కొంపతీసి ఇంగ్లండు వెళ్ళడములేదుకదా? వాలకముచూస్తే అలా కనుపించదు కాని అంతకంటే కొలంబో వెళ్ళవలసిన పనేమో కనుపించదు' అన్నాడు. 'అలాగా అండి, నా వాలకము ఎందుచేత అలా కనిపించడము లేదు? అందులో తమరేమి లోటు కనిపెట్టా' రన్నాను. 'అబ్బాయి, మీ తెలుగుదేశములో ఒక చిన్నకథ ఉంది. ఒక శాస్తుర్లుగారు ఊరికి వెడుతున్నారట. ఆయన్ని చూసి ఒక తుంటరి కుర్రవాడు 'ఏమండోయ్, తిమ్మన్నగారూ, ఎందాకా దయచేస్తున్నారు' అన్నాడట. 'నాయనా, నీవెవరో జ్ఞాపకము రాకుండా ఉంది. నన్నెక్క డెరుగుదువు? నాపేరెవరు చెప్పారు?' అని అడిగా డటాయన. అడుగుతే వాడు నవ్వుతూ ' అయ్యా నేనిదివర కెప్పుడూ తమదర్శనము చెయ్యలేదు. అయినా తమ ముఖము చూస్తే తమపేరు తిమ్మన్నగారే అయి వుంటుందని ఊహించాను. నా ఊహ నిజమే అయిం'