పుట:Baarishhtaru paarvatiisham.pdf/65

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

నవే అని చెప్పాడు. ఇంగ్లండుకంటెకూడా చెన్నపట్నమే తప్పకుండా పెద్దదనుకున్నాను. ఈ ఊళ్ళో బంధువులూ, స్నేహితులూ, ఒకళ్ళనొకళ్ళు చూసుకోవాలంటే పొరుగూరు ప్రయాణములాగే ఉంటుంది కదా అనిపించింది. ఊరి కొక చివర ఉద్యోగస్థులు, రెండోచివర ఆఫీసు ఉంటే, అక్కడికి వెళ్ళడమెలాగా అనుకున్నాను. పోనీ ఇన్ని స్టేషన్లు ఉన్నయికదా అని రైలు ఆగదు. ట్రాముకార్లయినా ఊరంతా ఉన్నట్టు కనుపించదు. ఇంక వీళ్ళు, ఏ ఎద్దుబండో జట్కా బండోఎక్కితే, ఆఫీసుకు వెళ్ళడ మెప్పుడు. అక్కడ పనిచెయ్యడ మెప్పుడు, మళ్ళీ ఇంటికి రావడమెప్పుడు? రాకపోకలకే వీళ్ళ జీతములోనూ, జీవితములోనూ సగము సరిపోతుందే, ఏలాగా అనుకున్నాను. పోనీ పనిపాటల సంగతి అలా ఉండగా ఇందులో పెద్ద ఉద్యోగస్థులూ, చిన్న ఉద్యోగస్థులూకూడ ఉంటారాయను. నెలకు ఏ పదిహేను రూపాయలో సంపాదించుకునే గుమాస్తా బతకడమేలాగు? ఇంతదూరము వాడు రోజూ రెండుసార్లు నడుస్తాడా, బండెక్కుతాడా? బండెక్కేటట్లయితే వాడు నెలరోజులు కష్టపడి చెమటోడ్చి సంపాదించింది ఒక్కరోజు బండికే సరిపోతుందే! పొద్దున నాదగ్గిర బండివాడు మైలుకి రూపాయి చొప్పున గూబలు వడేసి పుచ్చుకొన్నాడే! ఇంక వీళ్ళు తెచ్చింది కాస్తా బండికే పెడితే పెళ్ళాలకీ, పిల్లలకీ ఏమి మిగులుతుంది అనుకున్నాను. కావడము వాళ్ళు తినడము పులుసూ, చారు మెతుకులూ అయినా దానికికూడా కొంత కావాలికదా. ఎంతసేపాలోచించినా నా కేమీ ఉపాయము తోచలేదు. నేనైతే సూక్ష్మబుద్ధి కలవాణ్ణే కాని యీ సమస్య మాత్రము విడగొట్టలేక పోయినాను.