పుట:Baarishhtaru paarvatiisham.pdf/63

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

దగా, యుక్తిగా, వెనక్కు తగ్గుతారని మా మేష్టారు చెప్పినట్లు - నేనూఅటువంటి సందిగ్ధ సమయంలో వెనకంజ వేస్తాను.

కాని రూపాయి అనవసరముగా గార్డు కిచ్చినందులకు మాత్రము చాలా విచారంగా ఉంది. ఏమీ అంటే పైకి మరో లాగు కనబడ్డా నేను బహు జాగ్రత్త మనిషిని. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టడం నాకిష్టములేదు. అలా అని సమయము వచ్చినప్పుడు వెనక్కి తీసేవాణ్ణి కాను. కాని మంచో చెడో కొంచెం దూరాలోచన కలవాణ్ణి గనుక ఒక్కటే పద్ధతి పెట్టుకున్నాను. ఒకటి వేసి పది లాగాలనే పద్ధతిలో వాణ్ణి. అందుకనే వాడే మనుకున్నా, నేను వట్టి వెర్రివాణ్ని అనుకున్నా గార్డు కొకరూపాయి ఇచ్చాను. రూపాయి పోయినా, దూరపు ప్రయాణము గనుక ఇరుకులేకుండా సౌఖ్యంగా నలుగురెక్కే పెట్టెలో నేను ఒక్కణ్ణే కూర్చోవచ్చుగదా అనుకున్నాను. కాని నా జన్మలో ఈ ఒకసారి మట్టుకు మోసపడ్డాను. అదివర కెప్పుడూ ఇంత దొంగని చూడలేదు.

ఇప్పుడు పెట్టెలో ఇంకొకళ్ళెక్కారనే విచారము లేదు, నాకు పట్టుకున్న దేమిటంటే, నిష్కారణంగా వాడు నన్నెందుకు ద్రోహము చెయ్యాలని. కావాలంటే దేహి అని చెయ్యి జాస్తే లే దంటానా? నేనంత కష్టసుఖా లెరుగని వాడినా? కాదే! మానవ స్వభావములో ఎంత దుర్మార్గముంది. అందులోనూ వాడు దొర కూడాను. అంత మోసగాళ్ళు గనకనే వాళ్ళింతటి రాజ్యము సంపాదించ కలిగారు. లేకపోతే వాళ్ల అబ్బ తరమా? తాత తరమా? అందుకనే గొప్పగొప్ప వాళ్ళంతా బోడి నారాయణరావు ప్రభృతులు వీళ్ళను దేశములో నుంచి వెళ్ళగొట్టాలని చూస్తూ వున్నారు.