పుట:Baarishhtaru paarvatiisham.pdf/61

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

3

రైలు బయలుదేరింది. ఇంకో పది నిమిషాలకు 'ఎగ్మూరు' స్టేషనులో ఆగింది. అక్కడ బంట్రోతు నడిగితే, ఇదంతా చెన్నపట్నమే నన్నాడు. ఎంత గొప్ప పట్న మని ఆశ్చర్య పోతూ, ఊరు మధ్యనుండి కూడా రైలు వేశారు, ప్రజలకేమీ ప్రమాద ముండదుగదా అనుకున్నాను.

ఇంతట్లోకే నా పెట్టెలోకి, నలుగురు అరవవాళ్ళు రాబోయారు. 'చిలకల్లా వస్తున్నారా నాయనా, అవతలికి దయ చెయ్యం' డన్నాను. వాళ్ళు నామాట వినుపించుకోలేదు. మాట్లాడకుండా తలుపు తీస్తున్నారు. 'అబ్బాయి, మీకు తెలియదు. ఇది సెకండుక్లాసు, ఇందులో ఎక్కితే జుల్మానా వేస్తారు. అవతలికి వెళ్ళి యింకో పెట్టిలో ఎక్కం' డన్నాను. అందులో ఒకడు నా ముఖముకేసి చూసి 'నువ్వు ఇక్కడున్నావే. ఫోర్తుక్లాసు పెట్టెలో ఎక్కవలసిన మనిషివలె వున్నావు, దయ చేయ' మని వచ్చీ రాని తెలుగులో అన్నాడు. వాళ్ళ సాహసము చూస్తే నా కాశ్చర్యము వేసింది. 'చిత్తము, పెంకెతనానికి సౌందర్యానికి మీది పుట్టిల్లు. ఇంక కబుర్లకేమి లోటు గనుక, అధిక ప్రసంగము చెయ్యకు. దయ చెయ్య' మన్నాను. నేను అన్నదంతా వాళ్లకు బాగా అర్థము కాలేదని తోస్తుంది. అందుచేత నామాట వినిపించుకోనట్టు నటించారు.