పుట:Baarishhtaru paarvatiisham.pdf/57

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

వెళ్ళాను. సాయంకాల మయిదున్న రయ్యేసరికి బీచిస్టేషన్ దగ్గరకు వచ్చాను. రైలు బయలు దేరడానికి అట్టే టయిము లేదన్నారు. నేను కొలంబో వెళ్ళాలి. ఎలా అన్నాను. 'మీరు సెకండుక్లాసులో వెళ్ళితే ఏకంగా టిక్కట్టు ఇస్తాము. శ్రమలేకుండా వెళ్ళవచ్చును; మూడో క్లాసులో వెడితే చాలా యిబ్బంది పడవలసి వస్తుం' దన్నాడాయన. ఇంగ్లండు వెడుతున్న వాళ్లము సెకండు క్లాసు టిక్కెటు కొనడానికి ఆలోచనేమిటని, 'సరే, అయితే సెకండుక్లాసు టిక్కట్టే ఇప్పించం' డన్నాను. టిక్కట్టిచ్చి 'మీరు రేపు సాయంకాలానికి ట్యూటికొరిన్ వెళ్తారు. అక్కడ దిగి స్టీమరెక్కినట్లయితే మరునా డుదయానికి కొలంబో చేరగలరని' చెప్పాడు. 'అయితే ఒక రాత్రి స్టీమరులో ఉండాలా. రైలు తిన్నగా కొలంబోదాకా వెళ్ళదా' అన్నాను. నా ముఖముకేసి చూసి అదివర దాకా నాతోటి మాట్లాడుతున్న గౌరవస్వరము మార్చి 'అబ్బే, వెళ్లడము లేదండి యీ మధ్య, పూర్వము రాములవారి వారధి బాగుండేటప్పుడు వెళ్ళేదిట. కాని దరిమిలా అది, సికస్తుపడి సముద్రము మామూలుగా అడ్డుగా ఉండటమువల్ల ఇప్పుడు వెళ్ళడము మానివేసింది. అది బాగుచేయడానికి మళ్ళీ ఆంజనేయులుగారికి కబురు చేద్దామనుకుంటే, వారి అడ్రసు సరిగా తెలియలేదు. అసలు తిన్నగా కొలంబోదాకా రైలు వెళ్ళవలెననే మా ఉద్దేశముకూడా' అన్నాడు.

మారు మాట లేకుండా నా టిక్కట్టు తీసుకుని రైలు దగ్గిరికి వెళ్ళాను. గార్డు స్వయంగా వచ్చి సెకండుక్లాసు పెట్టెలో ఎక్కించాడు. మీకు సౌఖ్యంగా ఉంటుందనీ, ఎవ్వళ్లూ అట్టేమంది ఎక్కరు మీరు సుఖంగా పడుకోవచ్చుననీ, చెప్పి