పుట:Baarishhtaru paarvatiisham.pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మూడు గంటలయింది. ఆకలిగా ఉంది. బండివాడికి డబ్బులిచ్చి పంపి వేశాను. ఈసారిమట్టుకు వా డాట్టే పేచిపెట్టలేదు. సమీపంలో ఉన్న కాఫీ హోటలులోకి వెళ్ళాను. నేనూ చాలా కాలము పట్నవాసములో ఉన్నా ఎప్పుడూ కాఫీ హోటలులోకి వెళ్ళలేదు. ఇదే మొదటిసారి. కుర్చీలూ, బల్లలూ ఉన్నాయి. చాలామంది ఫలహారాలు చేస్తున్నారు. ఒకాయన యజమాని కాబోలు, గుమ్మం దగ్గిర కుర్చీ వేసుకుని కూర్చొని డబ్బు వసూలు చేస్తున్నాడు. ఫలహారాలు చాలా రకా లున్నాయి. నేనూ వెళ్ళి ఫలహారాల బల్లకి దగ్గరగా ఉన్న కుర్చీమీద కూర్చున్నాను. నల్లని తుండులాంటి కుర్రవాడు నాదగ్గిరకు వచ్చి ఏమికావాలన్నాడు. ఏ మడగడానికీ నాకేమీ తోచలేదు. గుక్క తిప్పుకోకుండా, ఏవో యిరవై వస్తువులు ఏకరువు పెట్టాడు. ఒకటీ నాకు సరిగ్గా వినపడలేదు. ఆ బల్లకేసి చూపించి నాకు కావలసిన వస్తులేవో తెప్పించుకు తిన్నాను. కాఫీ తెమ్మన్నాను. రెండు ఇత్తడి గిన్నెలు తెచ్చి కాఫీ అందులో చల్లారబోయడము మొదలు పెట్టాడు. ఆపద్ధతి నాకు బహు తమాషాగాఉంది. ఓ గిన్నెలోనుంచి ఓగిన్నెలోకి నిలువు ఎత్తునా ఎత్తిపోయడము మొదలు పెట్టాడు. ఆ వేడి వేడి కాఫీ అంతా వాడి కాలిమీదో, నానెత్తిమీదో, పడుతుందని హడిలిపోతూ కూచున్నాను. మొత్తముమీద అటువంటి ప్రమాదమేమీలేకుండా, వేడి తుంపురులు మట్టుకు వెదజల్లి, నా కాఫీ నాకు ఒప్పజెప్పాడు.

కాఫీ పుచ్చుకుని ఎంతయిందన్నాను. 'చెపుతా లెండి. అక్కడకూచున్నాయనకు ఇవ్వం 'డన్నాడు. సరేనని ముందుకు