పుట:Baarishhtaru paarvatiisham.pdf/46

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

'ఏది ఎక్ట్స్రా?'

'ఈ నెయ్యి'

'ఎక్ట్స్రా ఏమిటి నీ పిండాకూడు!'

'ఇప్పుడు మళ్ళీ వేసుకుంటిరే ఒక స్పూన్, అది ఒక కాలణా అవును సార్?'

'అయితే ఏ మంటావు?'

'వేసేదా సార్?'

'వెయ్యి, మరి వెయ్యడానికి కాకపోతే నీ సౌందర్యాతి శయము చూచి ఆనందించడానికి పిలిచా ననుకొన్నావా!' నే నన్నదివాడికి పూర్తిగా అర్ధముకాలేదు. పాపము కొంచెము నవ్వుకుని, 'ఏమి సార్, అష్టా గేలి సేస్తారు!' అన్నాడు.

తన్నేదో స్తోత్రము చేశానుకున్నాడు కాబోలు పాపము. వెనుకటికి ఒక డిప్టీ కలక్టరుగారు ఒక అమాయకపు కరణాన్ని, ఏదో సందర్భములో, నువ్వు వట్టి బుద్ధిహీనుడులాగా ఉన్నావే అన్నారట. ఆ కరణము తన్నేదో మెచ్చుకుంటునారనుకుని 'చిత్తము, చిత్తం మహాప్రభో, ఏలినవారి కటాక్షము! తమబోటి పెద్దలందరిచేతా అలాగే అనిపించు కుంటున్నా' అన్నాడట. అలాగ్గా ఉంది ఈ వడ్డనవాడి సంగతి.

తక్కినవాళ్లంతా పులుసూ అన్నమూ తినగానే చారు వడ్డించుకున్నారు. నాకు ఊరికే నవ్వు వచ్చింది వాళ్ల తిండి వరసచూసి. పులుసో చారో, ఏదో ఒకటి కాని, రెండూ ఏమిటి వీళ్ళ తలకాయనుకొన్నాను. సరే! వీళ్లేలా తింటే నాకెందుకని త్వరగా రెండు మెతుకులు నోట్లో వేసుకుని లేచి వచ్చాను. అక్కడ వరసంతా చూస్తే భోజనము చేసినట్లే లేదు నాకు.