పుట:Baarishhtaru paarvatiisham.pdf/45

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మనిషికి రెండు గరెటల చొప్పున, ఒకాయన వడ్డించుకు వెళ్ళాడు. నా పక్కని కూర్చున్న అరవవాళ్ళు కొంతమంది చెయ్యిపట్టి ఆ నెయ్యి దాహము పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నా రనుకొన్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకొని ఆ వట్టినెయ్యీ అన్నమూ తిన్నారు! నేనూ వేయించుకొన్నాను. నెయ్యి పాడువాసన. ఈ నెయ్యే తాగుతున్నారు మొగము వాచినట్లు; అప్పుడు కాచిన ఇంటినెయ్యి లభ్యమయితే వీళ్ళు చెంబుల తోటి మంచినీళ్లవలే దాహము పుచ్చుకుంటారు కాబోలుననుకొన్నాను.

నేతివడ్డన అవుతుండగానే ఇంకొకాయన పులుసు తీసుకు వచ్చాడు. ప్రతివాళ్లూ, ఒక పప్పు కలుపుకోడము లేదు. కూర కలుపుకోడము లేదు. పచ్చడి కలుపుకోడము లేదు; ఏమీలేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యిలేకుండా వట్టి అన్నము తింటూ అందులోనే కూరా, పచ్చడీ, నంజుకున్నారు. ఏమిటీ అడివి తిండి! పాపము, వీళ్ళు తిండి తినడముకూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రముగా పప్పు కలుపుకున్నాను; పులుసు వద్దనే సరికి అంతా తెల్లపోయి నాకేసి చూశారు. కాకులకు కోకిలరూపు చాలా అందవికారముగానూ, కంఠము కఠోరముగానూ ఉంటుందట. అలాగే ఈ అరవ వాళ్లకి నేను వట్టి అనాగరికుడుగా కనబడ్డాను. ఆశ్చర్య మేమిటి! పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగా కనపడుతుంది.

తరువాత నేను కూర కలుపుకున్నాను. కలుపుకుని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళునెయ్యి అయినా వేసుకొనడము తప్పుతుంది గనకనా! తీసుకువచ్చి 'అది ఎక్ట్స్రా సార్!' అన్నాడు.