పుట:Baarishhtaru paarvatiisham.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మన్నారు. వీడు మోసము చేశాడు పోనీ దిగుదామా అనుకొంటూ ఉంటే వాళ్లందరినీ తిడుతూ వాళ్ల నెప్పుడూ నమ్మ వద్దని నాకు హితోపదేశము చేస్తూ నా బండివాడు గబగబ బండి తోలాడు: తోవ పొడుక్కీ కష్టము చాలదనీ ఆ రోజున ఉదయము నుంచీ, బేరము లేకపోవడా న్నుంచీ, తక్కిన వాళ్ళు కట్టి వేస్తారేమోననే ఆదుర్దా కొద్దీ, తక్కువకు ఒప్పుకున్నాననీ, ఇంకొక కాలు రూపాయి అయినా వాడి కష్ట మాలోచించి ఇమ్మనీ ప్రాధేయ పడుతూ, పదినిమిషాల్లో సత్రము దగ్గిర దింపాడు.

అప్పుడే రెండు మైళ్ళు వచ్చామా అనుకుంటూ, అయినా పట్నవాసములో దూరము అట్టే తెలియ దని సమాధానము చెప్పుకొని, గుర్రము బహుత్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి రెండుంబేడ ఇచ్చివేశాను. ఇంకోబేడ ఇమ్మని చాలాసేపు బతిమాలి, కోపపడి, తిట్టి, చక్క పోయినాడు.

సత్రములో జనము కిటకిట లాడుతున్నారు. ఇంతమంది పొరుగూరు జనమిక్కడి కెందుకు వచ్చారా అనుకున్నాను. లోపలికి వెళ్ళాను. గూడకట్టు కట్టుకుని అది మోకాలుపైకి మణిచి, జుట్టు కొప్పెట్టుకుని, నెత్తిమీద నుంచి చమురు మొహము మీదికి కారుతూ, నల్లగా లావుగా శిలావిగ్రహములాగా ఒక మనిషి కనపడ్డాడు. కాళ్ళు ఎడముగా పెట్టుకుని నిలబడి నాకేసి ఎగాదిగా చూసి 'ఎన్నా వేణుం' అన్నాడు.

'మీరన్న దేమిటో నాకు తెలియదు కాని నా కొకగది కావాలి ముందు.'

'ఓ అష్టనా! నీవు ఎవరు బ్రాహ్మణుడా కాదా? మీది యావూరు? ఎన్ని దినా లుండబోతావు? ఎక్కడ పోతావు? ఈ వూరెందుకు కొచ్చావు?' అని ఆరంభించాడు.