వచ్చిన బండిదా చేసుకొని పోండిమీ. ఈ ఎండలో ఎష్టదాపోతావు. మేము భద్రముగా కొంచుపోతాము సామీ ' అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకు వచ్చినవాడు కూలి ఇమ్మని తొందర పెట్టాడు.
'ఏమి యివ్వాలి?'
'ఏమి సామీ, మీరు నన్నడుగుతారే, మీకు తెలియదా!'
'నాకు తెలియ' దన్నాను.
'ఏమి సామీ తమాషా చేస్తారు. యిచ్చెయ్యండి పోవాల.'
అర్ధణా అణా యిస్తే బాగుండ దని రెండు అణాలు తీసి పుచ్చుకో మన్నాను. నాకేసి ఒకమాటు, డబ్బుల కేసి ఒక మాటూ చూచి వాడు,
'ఏమి సామీ, ఏమిది, నేను ముష్టివా డనుకొంటివా ఏమి? బిచ్చము వేసినట్లు రెండు అణాదా తీసుకోమంటువే?' అన్నాడు.
నేను నిర్ఘాంతపోయి 'పోనీ అని ఎక్కువ యిస్తే ముష్టి అంటాడేమిటి? ఈ ఊళ్ళో ముష్టివాళ్ళకి అంతా బేడలూ పావలాలూ యిస్తారా ఏమిటి చెపుమా' అనుకుని,
'మరి అయితే ఎంత యిమ్మంటావు?' అన్నాను.
'ఒక రూపాయ.'
నా గుండె బద్ధలైంది! సరే తీసుకు పొమ్మని ఇంకో రెండు అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నామీదికి గిరాటువేసి రూపాయకు ఒక దమ్మిడీ తక్కువైనా పుచ్చుకో నన్నాడు. పుచ్చుకోకపొతే మానివెయ్య మన్నాను. అంత దర్జాకు పోయిన వాడు పుచ్చుకోకుండా పోతాడేమో నను కున్నాను- పోలేదు. నన్ను తిట్టడము ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండ్లవాళ్ళు