పుట:Baarishhtaru paarvatiisham.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

గతి ఏమికాను? ఎలాగని హడిలిపోయి వాడి వెంబడి పడ్డాను. నా టిక్కట్టు నా కిమ్మని ప్రాధేయ పడ్డాను. వాడు నన్ను కోపముతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానముగా ఉన్నా ఎలా పోను? టిక్కట్టు వాడి చేతిలో చిక్కుపడి పోయింది. అందుకని అభిమానము చంపుకొని వాడిని వెంబడించాను. ఆఖరుకు రైలు కదిలే వేళయింది. ఇంకొక నలుగురైదుగురు నల్లదొరలు చేరారు. 'దయచేసి నా టిక్కట్టు ఇప్పించండి ' అన్నాను.

'Get away man, you seem to be a fool' అన్నాడు.

'అయ్యా నాటిక్కట్టు యిప్పించి మీరెన్ని తిట్టినా పడతాను. నా టిక్కట్టు ఇవ్వరు, పైగా తిడతారేమండీ ' అన్నాను ఒళ్ళుమండి. రైలు కూసింది.

'Get in man. You have no bloody fear. Nobody will ask you' అని నన్ను రైలులోకి తోశారు.

రైలు కదిలింది-ఏమి చెయ్యడానికి గత్యంతరము తోచలేదు. స్టేషన్ లో ఆ దొరలంతా కడుపులు పట్టుకుని నవ్వు కుంటున్నారు-నేను దిగుదామా అని ప్రయత్నము చేశాను-నా పక్కనున్నాయన నన్ను ఆపి, ఏమిటి సంగతి అని అడిగాడు-ఆయన తోటి చెప్పాను, ఇలా టిక్కెట్టు తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడాయన నవ్వి, వచ్చే స్టేషనే చెన్నపట్నము, అక్కడే అంతా దిగిపోవడము- అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని; టిక్కట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు- నీకే భయము లేదని